logo

బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా

పెండింగ్‌లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Published : 05 May 2024 06:09 IST

బాన్సువాడలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, న్యూస్‌టుడే: పెండింగ్‌లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడల్లో శనివారం నిర్వహించిన రోడ్‌ షోల్లో పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మారడంతో బిల్లులు ఇవ్వాలని మంత్రిని కోరితే అంగీకరించారు. కానీ ఇక్కడి కాంగ్రెస్‌ నాయకుడు బిల్లులు ఇవ్వొద్దని చెప్పడంతో మంత్రి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నాయకులను బెదిరించి బలవంతంగా కాంగ్రెస్‌ కండువాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీపాటిల్‌ను గెలిపిస్తే పదేళ్లు ఏమీ చేయలేదని, అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే బోధన్‌-బీదర్‌ రైల్వేలైన్‌, జాతీయ రహదారులు తీసుకొస్తానని, ప్రతీ నియోజకవర్గంలో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజవకర్గ ఇన్‌ఛార్జి పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, బద్యానాయక్‌, గంగాధర్‌, జుబేర్‌, ఎజాస్‌, గురువినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని