logo

ఇందూరులోనే పసుపు బోర్డు..

కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్‌గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు.

Published : 06 May 2024 04:50 IST

బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి
సహకార విధానంలో చక్కెర కర్మాగారాలు
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
ఈనాడు, నిజామాబాద్‌

కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్‌గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. ఇది పసుపు రైతుల కోసం చేసిన పెద్ద పనిగా ఆయన కితాబిచ్చారు. నిజామాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇందూర్‌ విశాల్‌ జనసభలో ఆయన ప్రసంగించారు. ఇప్పుడు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడనే చర్చ సాగుతోందని.. మీరు మళ్లీ అర్వింద్‌ను గెలిపిస్తే నిజామాబాద్‌లోనే ఏర్పాటై తీరుతుందన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి ఏర్పాటు ఆవశ్యకత ఉందని.. అది కూడా తప్పక ఏర్పాటు చేస్తామని.. ఇది మోదీ గ్యారంటీగా చెప్పారు. బోధన్‌, మెట్‌పల్లి ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలు మూతపడటానికి భారాస, కాంగ్రెస్‌లే కారణమని ఆరోపించారు. వీటిని తెరిపించి రైతుకు మేలు జరిగేలా చేయటంతో పాటు సహకార విధానంలో నిర్వహించేలా చూస్తామన్నారు. అర్వింద్‌ను గెలిపించేందుకు తాను ఇక్కడి వచ్చానని.. సిద్ధులగుట్ట, డిచ్‌పల్లి రామాలయం, త్రివేణి సంగమ ప్రాంతం కందకుర్తి, బాసర సరస్వతిని తలచుకొంటూ ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని కలవాలంటే ఎక్కడ ఉంటారో వెతకాల్సిన పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. అర్వింద్‌ స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తారన్నారు.

భాజపా అభ్యర్థి అర్వింద్‌, వేదికపై ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌,
నాయకులు యెండల, దినేష్‌, పల్లె గంగారెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు

కమల దళంలో జోష్‌..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా నిర్వహించిన సభకు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రత్యర్థి పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రసంగించారు. ఓటర్లంతా 13న ఈవీఎంల బటన్‌ను గట్టిగా నొక్కాలని.. ఇక్కడ నొక్కితే ఇటలీలో షాక్‌ తగలాలని చమత్కరించారు. గడిచిన పదేళ్లలో కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల గురించి వివరించారు. ప్రతి నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. అది జరగాలా వద్దా? అంటూ సభికులను అడిగారు. వారు సానుకూలంగా స్పందిస్తూ.. హుషారు చాటుకున్నారు. సభకు పెద్దసంఖ్యలో జనం రావడంతో భాజపా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు దినేష్‌ కులాచారి, సత్యనారాయణ, నాయకులు వెంకటరమణి, గద్దె భూమన్న, పోతాంకర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు


రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డివి అబద్ధాలు

- ధర్మపురి అర్వింద్‌, భాజపా అభ్యర్థి 

నా ప్రాణం ఉన్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తగ్గించే ప్రసక్తే లేదని మోదీ ప్రకటించినా రేవంత్‌రెడ్డి ఇంకా దీనిపై అబద్ధాలే మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే అబద్ధాలు చెప్పి మహిళలను మోసగించారు. ఓట్లు దండుకొన్నారు. మరోసారి రిజర్వేషన్ల అంశంతో మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు విశ్వవిద్యాలయాను మైనార్టీల పరం చేసి ఇతర వర్గాలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్సే. ఆరు గ్యారంటీలంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్‌.. తులం బంగారం, మహిళలకు రూ.2500, రూ.4 వేల పింఛను, రైతులకు రూ.500 బోనస్‌ అంటూ మభ్యపెట్టారు. అడ్డదారిలో దక్కిన అధికారం ఎక్కువ కాలం నిల్వదు. మోదీ ప్రపంచానికి దిక్సూచి. దేశ ప్రగతి కోసం ఆయనకు మద్దతుగా నిలవాలి. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి.


మోదీతోనే రైల్వేలైన్ల అభివృద్ధి

- యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఒకప్పుడు మీటర్‌ గేజ్‌గా ఉన్న నిజామాబాద్‌ రైల్వే లైనును బ్రాడ్‌ గేజ్‌గా మార్చేందుకు ఉద్యమం చేశాం. కానీ, ఇప్పుడు ఈ మార్గం పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్‌ జరిగింది. ముద్కేడ్‌ - డోన్‌ 417 కి.మీ. మేర లైన్‌ను డబ్లింగ్‌ చేసే కార్యాచరణ కొనసాగుతోంది. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కాంగ్రెస్‌, భారాస హయాంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేశారే తప్ప కాల్వలు అందుబాటులోకి రాని పరిస్థితి.


అవినీతికి ఆస్కారం లేదు

- పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి

మోదీ పాలనతోనే దేశానికి భద్రత, భవితరాలకు భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వం కోరుకుంటున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. 400 సీట్లు రావాలనేది ఆయన కోరిక.. అందుకే నిజామాబాద్‌లోనూ కమలానికి ఓటు వేసి అర్వింద్‌ను గెలిపించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని