logo

పకడ్బందీ తనిఖీలు.. ప్రలోభాలపై చర్యలు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published : 09 May 2024 02:50 IST

ఈ నెల 2న ఒకటో ఠాణా పరిధిలో పట్టుకున్న రూ.4 లక్షలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నేరవిభాగం: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానుకలు ఇవ్వడం, డబ్బులు, మద్యం పంపిణీ, ఇలా ఓటర్లను ప్రలోభపెట్టే వీలుంది. వీటికి చెక్‌ పెట్టేందుకు నిజామాబాద్‌  పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను తనిఖీ చేసి నగదు, మద్యం, ఉచిత వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు..

కోడ్‌ అమలు నుంచి..

కోడ్‌ అమలవుతున్నప్పటి నుంచి నిజామాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాల్కొండ, బాన్సువాడలోని ఆయా ఠాణాల పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా నగదు, బంగారం, ఇతర వస్తువులు తరలిస్తుంటే పట్టుకొని స్వాధీనం చేశారు. ఈ నెల 7 వరకు 1.49 కోట్ల నగదు, 3296.77 లీటర్ల మద్యం, మాదక ద్రవ్యాలు 6.92 కిలోలు, 400 తులాల బంగారం, వస్తువులు 1775 స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందించండిలా..

తమ ప్రాంతంలో ఎవరైనా ప్రలోభపెడితే సమీప ఠాణాలో సమాచారం ఇవ్వొచ్చు లేదా డయల్‌ 100లో సంప్రదించవచ్చు. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంటాయి. వీటితో పాటు కలెక్టరేట్‌లో ఎన్నికల సహాయక కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదైనా 1950 టోల్‌ ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి చెబితే అధికారులు చర్యలు తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని