logo

ఉపాధి కల్పించండి సారూ..

ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు.

Published : 09 May 2024 03:00 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉపాధిహామీ కూలీలు దోమకొండ మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన వారు. వారం రోజుల కిందట 200 మందికి పైగా కూలీలు పని ప్రదేశానికి వెళ్లారు. అక్కడ 150 మందికి మాత్రమే పని ఉందని మిగతావారు ఇంటికి వెళ్లాలని క్షేత్ర సహాయకుడు చెప్పారు. దీంతో కూలీలు అతణ్ని నిలదీశారు.

నిజాంసాగర్‌ మండలం గోర్గల్‌ గ్రామ పంచాయతీ ఎదుట ఉపాధి కూలీలు తమకు మూడు నాలుగు రోజుల నుంచి పనులు కల్పించడం లేదని ధర్నా నిర్వహించారు. క్షేత్ర సహాయకుడి బంధువు చనిపోవడంతో అక్కడ పనులు చేయించలేదు. పంచాయతీ కార్యదర్శి లేదా సీనియర్‌ మేట్‌ సహకారంతో పనులు చేయించాల్సినా అధికారులు పట్టించుకోలేదు.

కామారెడ్డి సంక్షేమం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్‌కార్డు కలిగిన కూలీ పని అడిగితే తప్పకుండా చూపించాలి. కానీ జిల్లాలో కూలీల డిమాండ్‌ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కూలీలు ఎక్కువగా హాజరయ్యేది మే నెలలోనే. ప్రతి పంచాయతీ పరిధిలో 200 మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసినా ఆ దిశగా చర్యలు లేవు. ఈ లెక్కన జిల్లాలో రోజుకూ 1.05 లక్షల మందికి పని కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం 75 వేల మంది మాత్రమే వెళ్తున్నారు. పంచాయతీకి సరాసరిగా 140 మంది మాత్రమే హాజరవుతున్నారు.

ప్రణాళిక లేమి...  : జిల్లాలో వ్యవసాయ సీజన్‌ ముగియడంతో చాలా మంది కూలీలు, రైతులు ఉపాధి పనులకు మొగ్గు చూపుతున్నారు. క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే పని అడిగిన కూలీలందరికీ ఉపాధి చూపించవచ్చు. జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా కేవలం 298 మంది క్షేత్రసహాయకులు మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా చోట్ల విధులు నిర్వహిస్తున్న వారిపై పని భారం పడుతోంది. ఎఫ్‌ఏలు విధుల్లో చేరాక పంచాయతీ కార్యదర్శులు ఉపాధి పనులపై దృష్టి సారించడం లేదు.  

అధికారులకు ఆదేశాలిచ్చాం

చందర్‌నాయక్‌, డీఆర్‌డీవో, కామారెడ్డి

జిల్లాలో జాబ్‌కార్డులు కలిగిన వారందరికీ కచ్చితంగా పని కల్పిస్తాం. కొన్ని మండలాల్లో ఇటీవల కూలీలకు పనులు కల్పించడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఆరా తీస్తాను. క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో కలిసి పని చేయాలి. అడిగిన వారందరికీ పని కల్పించాలని మండలాల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని