logo

ఆ ఓటర్లే కీలకం

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు.

Updated : 10 May 2024 06:18 IST

యువత, మహిళలదే నిర్ణయాత్మక పాత్ర

ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. ఈ వర్గాల ఓటర్లు అధికంగా ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వశక్తి, యువజన సంఘాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ యువత, మహిళలు అభ్యర్థుల విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ వర్గాలకు చెందిన ఓట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.

మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు

2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ముందున్నారు. దీనికి తోడు జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మహిళా ఓటర్లు 51.14 శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు అతివల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో బీడీకార్మికులున్నారు. వీరి మద్దతుకు కృషి చేస్తున్నారు. టేకేదార్ల ద్వారా గంప గుత్తగా ఓట్లకోసం మంతనాలు సాగిస్తున్నారు.

యువ మంత్రం

లోక్‌సభ పరిధిలో యువ ఓటర్లు 53.49 శాతం ఉన్నారు. ఈ సారి నూతనంగా ఓటు హక్కు సాధించిన 18 నుంచి 19 ఏళ్లలోపు యువ ఓటర్లకు గాలం వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వీరు మొదటిసారి ఓటు వేయనున్న నేపథ్యంలో ఆకట్టుకునేలా ప్రచారం చేయడమే కాకుండా యువతకు చేస్తున్న మేలును నేతలు ప్రస్తావిస్తున్నారు. యువ ఓటర్లను కలుసుకునేందుకు భాజపా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో యువశక్తి పేరిట సమ్మేళనాలు నిర్వహించింది. యువజన కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం మండల, గ్రామస్థాయిలో యువతతో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన వందరోజుల్లోనే 33 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో కీలకంగా వ్యవహరించిన తమకే మద్దతు తెలపాలని కోరుతూ యువజన సంఘాల నేతలతో భారాస నాయకులు మంతనాలు సాగిస్తున్నారు.

ఆశలు.. హామీలు

మహిళలు, యువత ఓట్లను కొల్లగొట్టేందుకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు భవిష్యత్తుపై ఆశలు చూపెడుతూ హామీలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెబుతున్నారు. అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో విరివిగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఉన్నతవిద్య అభ్యసించేందుకు తోడ్పాటునందిస్తామని పేర్కొంటున్నారు.

నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు

మహిళలు : 8,39,133
యువ ఓటర్లు : 8,77,803
మొత్తం : 16,40,755

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని