logo

ఆ అయిదు గ్రామాలకు రుషికుల్యా గండం

ఒకరోజు.. ఒక వారం.. ఒక నెల కాదు.. చదువులమ్మ గుడికి వెళ్లాలంటే ఏడాది పొడవునా ప్రమాదకరంగా నది దాటాల్సిందే. నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఆ రాత్రి బడిలోనే గడపాల్సిన దుస్థితి. ఇదీ ఆ గ్రామాల విద్యార్థుల కష్టాలు.

Published : 08 Aug 2022 06:53 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే


నిత్యం ఇలాంటి కష్టాలే

* ఒకరోజు.. ఒక వారం.. ఒక నెల కాదు.. చదువులమ్మ గుడికి వెళ్లాలంటే ఏడాది పొడవునా ప్రమాదకరంగా నది దాటాల్సిందే. నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఆ రాత్రి బడిలోనే గడపాల్సిన దుస్థితి. ఇదీ ఆ గ్రామాల విద్యార్థుల కష్టాలు.
* పండించిన పంటలు అమ్ముకోవాలంటే నడుం లోతు నీటిలో నది దాటాల్సిందే.. ఇదీ అక్కడి రైతులు పడుతున్న అవస్థలు!!
* అనారోగ్యం బారిన పడిన వారు.. నిత్యావసరాలు తెచ్చుకునేవారు.. ప్రభుత్వ రేషన్‌ దుకాణాల నుంచి సరకులు తెచ్చుకోవాలంటే రుషికుల్యా నది ప్రవాహానికి ఎదురీది వెళ్లాల్సిందే.. ఇదే అయిదు గ్రామాలు ఎదుర్కొంటున్న నిత్య నరకం!!

చదువైనా, నిత్యావసరాలు, వైద్య అవసరాల కోసమైనా, వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడానికైనా గంజాం జిల్లా సురడా సమితిలో సురమణి పంచాయతీలోని అయిదు గ్రామాల ప్రజలు రుషికుల్యా నదిని దాటి వెళ్లాల్సిందే. సురమణి పంచాయతీ మీదుగా 59వ నెంబరు జాతీయ రహదారి సాగుతుండగా, సురమణికు అవతలివైపునున్న అయిదు గ్రామాలకు వెళ్లాలంటే రుషికుల్యా నది దాటాలి. ఆయా గ్రామాల్లో సుమారు అయిదు వేల జనాభా ఉంది. ఒక్క కేశర గ్రామంలోనే అత్యధికంగా 200 వరకూ కుటుంబాలున్నాయి. వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రజలు, విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఆయా గ్రామాల్లో 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులు నది దాటి నువాగడకు రావాలి. చుట్టూ తిరిగి రావాలంటే ఇరవై కి.మీ. దూరం ఉండడంతో కష్టమైనా.. విద్యార్థులు, ప్రజలు రుషికుల్యా నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.


మోకాలి లోతున ప్రమాదకరంగా రుషికుల్యా నది దాటుతున్న విద్యార్థినులు

నిలిచిన వంతెన నిర్మాణం
సురమణి పంచాయతీలో అత్యధిక గ్రామాలకు ప్రధానమంత్రి సడక్‌ యోజన, బిజు సడక్‌ యోజన కింద రహదారుల నిర్మాణాలు జరిగాయి. రుషికుల్యా నది, కాలువలు దాటేందుకు వివిధ చోట్ల ఏర్పాట్లు చేశారు. రుషికుల్యా నది దాటాల్సిన పరిస్థితి వస్తుండడంతో బిజు సేతు యోజన కింద నువాగడ నుంచి రుషికుల్యా నది మీదుగా అవతలివైపున్న కేశర తదితర నాలుగు గ్రామాలకు 2018లో వంతెన నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. 2020లో ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా, గడువు ముగిసి రెండేళ్లయినా ఇంకా పూర్తి కాలేదు. మందకొడిగా మొదలైన పనులు కొంతకాలంగా నిలిచిపోయాయి. దీంతో జిల్లా యంత్రాంగం నిర్మాణం పనులు చేపట్టిన సంబంధిత సంస్థను పలుమార్లు హెచ్చరించి, చివరకు దానిపై చర్యలు తీసుకోగా, అది హైకోర్టును ఆశ్రయించిందని భంజనగర్‌ సబ్‌కలెక్టరు జ్యోతిశంకర రాయ్‌ చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు ప్రమాదకరంగా నది దాటడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గంజాం కలెక్టరు దీనిపై ఆవేదన వ్యక్తం చేశారని, తక్షణం ఈ సమస్యను పరిష్కరించి, వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారని రాయ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని