logo

గోపాల్‌ దాస్‌కు మరికొన్ని పరీక్షలు

మాజీ ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్‌ హత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గతంలో బొలంగీర్‌ జిల్లాలో పాట్నాగఢ్‌ ప్రాంతంలోని పార్శిల్‌ బాంబు పేలుడు ఘటన ఛేదించేందుకు క్రైం బ్రాంచ్‌ జరిపిన దర్యాప్తు విధానాలను గోపాల్‌ చంద్రదాస్‌ కేసుకు అమలు చేస్తున్నారు.

Published : 06 Feb 2023 03:20 IST

గోపాల్‌ దాస్‌ (పాత చిత్రం)

కటక్‌, న్యూస్‌టుడే: మాజీ ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్‌ హత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గతంలో బొలంగీర్‌ జిల్లాలో పాట్నాగఢ్‌ ప్రాంతంలోని పార్శిల్‌ బాంబు పేలుడు ఘటన ఛేదించేందుకు క్రైం బ్రాంచ్‌ జరిపిన దర్యాప్తు విధానాలను గోపాల్‌ చంద్రదాస్‌ కేసుకు అమలు చేస్తున్నారు. దాస్‌కు లైడిటెక్టర్‌ పరీక్షలు జరిపించేందుకు దిల్లీ నుంచి సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ టెక్నీషియన్లు భువనేశ్వర్‌ చేరుకున్నారు. మరోవైపు ఝార్సుగూడ జిల్లా కోర్టులో ఐదు రోజుల రిమాండ్‌ కోసం క్రైం బ్రాంచ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం నాలుగు రోజులకు అనుమతించింది. క్రైం బ్రాంచ్‌ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. సెప్టిక్‌ ట్యాంకులో లభించిన కాగితపు ముక్కలను పరిశీలించేందుకు హ్యాండ్‌ రైటింగ్‌ బ్యూరోకు పంపించినట్లు వెల్లడించారు. దర్యాప్తు పర్యవేక్షణకు నియమించిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జేపీ దాస్‌ను శనివారం క్రైం బ్రాంచ్‌ అధికారి అరుణ్‌ బోత్ర కలిశారు. కటక్‌లోని న్యాయమూర్తి నివాసంలో కాసేపు చర్చలు జరిపారు. అనంతరం జేపీ దాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇంతవరకు జరిగిన దర్యాప్తును బోత్ర తెలియజేసినట్లు వెల్లడించారు. గోపాల్‌ దాస్‌కు మరికొన్ని పరీక్షలు చేస్తామని, హత్య మిస్టరీ త్వరలో వీడుతుందన్నారు.


సిట్‌కు కేసు అప్పగించాలి..


నర్సింగ మిశ్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యకేసు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌)కు అప్పగించాలని కాంగ్రెస్‌ సభా పక్షం (సీఎల్పీ) నేత నర్సింగ మిశ్ర డిమాండ్‌ చేశారు. ఆదివారం బొలంగీర్‌లో మిశ్ర విలేకరులతో మాట్లాడుతూ... దాస్‌ హత్యకేసు దర్యాప్తు క్రైంబ్రాంచ్‌, సీబీఐలకు సాధ్యం కాదని స్పష్టం చేశారు. దాస్‌ కాల్పులు జరిగి వెంటనే కుప్పకూలిపోయారని, ఝార్సుగుడ ఆసుపత్రిలోనే ఆయన చనిపోయారని తెలిపారు. మాజీ మంత్రి దాస్‌కు గనులు, రవాణా, హోటల్‌ తదితర వ్యాపారాలున్నాయని, ఆయన హత్య వెనుక పెద్ద కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నందున దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని