logo

ప్రియురాలిని 31 ముక్కలుగా నరికి.. భార్యతో కలిసి అడవిలో పాతిపెట్టి..

సాఫీగా సాగుతున్న యువతి జీవితంలోకి ఓ వివాహితుడు ప్రవేశించి, మాయ మాటలతో ప్రలోభపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు.

Updated : 27 Nov 2023 08:13 IST

తిలాబతి (పాత చిత్రం)

నవరంగపూర్‌, న్యూస్‌టుడే: సాఫీగా సాగుతున్న యువతి జీవితంలోకి ఓ వివాహితుడు ప్రవేశించి, మాయ మాటలతో ప్రలోభపెట్టి ఆమెకు దగ్గరయ్యాడు. శనివారం ఆమె తనని పెళ్లి చేసుకోవాలని అడగడానికి ప్రియుడు ఇంటికి వెళ్లగా, తన భార్యతో కలిసి దారుణంగా హత్య చేసి 31 భాగాలుగా నరికి అడవిలో పాతిపెట్టిన ఘటన నవరంగపూర్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది. రాయ్‌ఘర్‌ ఎస్‌డీపీవో ఆదిత్యసేన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాఘబెడ గ్రామానికి చెందిన లుథురామ్‌ కుమార్తె తిలాబతి గండ్‌(23) గురువారం సాయంత్రం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లొస్తానని చెప్పి ఎంతసేపటికీ రాలేదు. చుట్టు పక్కల గాలించి మరుసటి రోజు రాయఘర్‌ ఠాణాలో ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అసలేం జరిగింది... తిలాబతి బారసుండి గ్రామానికి చెందిన చంద్ర రౌత్‌ను ప్రేమించింది. అతడి ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని లేదంటే ఇక్కడే ఉంటానని మొరాయించింది. చంద్ర భార్య సియాబతి దానికి అంగీకరించకపోవడంతో ముగ్గురు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తిలాబతి కోర్టుకు వెళ్తానని చెప్పగా, భార్యాభర్తలిద్దరూ పథకం పన్ని శనివారం ఆమెను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురుమడిహి అడవిలోకి తీసుకెళ్లి 31 భాగాలుగా నరికి పాతిపెట్టి పరారయ్యారు. ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన గ్రామానికి చెందిన జుగుసాయి భయభ్రాంతులకు గురై, విషయాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహ భాగాల్ని వెలికి తీసి శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెలికి తీసిన శరీర భాగాల వద్ద పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని