logo

పుత్రోత్సాహం ముందు ఓడిన సిద్ధాంతం

సురేష్‌ రౌత్రాయ్‌. ఈయన రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులు. అయిదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన సొంతం. కాంగ్రెస్‌తో తన జీవితం పెనవేసుకుందని, ఆ పార్టీకే తాను అంకితమని పదేపదే చెప్పిన సురేష్‌ ఖుర్దా జిల్లా జట్నీ నుంచి అసెంబ్లీకి అయిదుసార్లు ఎన్నికయ్యారు.

Updated : 08 Apr 2024 06:52 IST

భువనేశ్వర్‌లో కొడుకుని గెలిపించడానికి సురేష్‌ ఆరాటం 
షోకాజ్‌ నోటీసు జారీ చేసిన పీసీసీ

తండ్రి సురేష్‌, మేయర్‌ సులోచనతో మన్మధ్‌ ప్రచారం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే:  సురేష్‌ రౌత్రాయ్‌. ఈయన రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులు. అయిదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన సొంతం. కాంగ్రెస్‌తో తన జీవితం పెనవేసుకుందని, ఆ పార్టీకే తాను అంకితమని పదేపదే చెప్పిన సురేష్‌ ఖుర్దా జిల్లా జట్నీ నుంచి అసెంబ్లీకి అయిదుసార్లు ఎన్నికయ్యారు. మంత్రిగానూ విధులు నిర్వహించారు. విపక్షాలకు, ప్రసార సాధనాలకు సన్నిహితంగా ఉంటూ వచ్చిన ఆయన తన వయసు ఎనిమిది పదులు దాటిందని, తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, విద్యావంతులైన ఇద్దరు కుమారుల్ని ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా చేసి వారి తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఒక ప్రైవేటు విమానయాన సంస్థలో కెప్టెన్‌గా పనిచేసి ఇటీవల ఉద్యోగం వదులుకుని వచ్చిన ఆయన చిన్నకుమారుడు మన్మధ్‌ తండ్రి మాట వినలేదు. కాంగ్రెస్‌లో చేరడానికి ససేమిరా అన్న ఆయన బిజదలో చేరారు. అసెంబ్లీ టికెట్టు ఆశించిన మన్మధ్‌కు నవీన్‌ ఏకంగా భువనేశ్వర్‌ లోక్‌సభ సీటు కేటాయించారు.

కొడుకును ఎలా విస్మరిస్తారు?

చిన్నకొడుకు మాట వినకుండా తన మనసుకు గాయం చేసినట్లు విలేకరుల వద్ద ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సురేష్‌ తాను చేసేదేమీ లేదని, కుమారుడు మేజర్‌ కావడంతో ఆయన అభిరుచికి గౌరవించక తప్పడం లేదన్నారు. మన్మధ్‌ భువనేశ్వర్‌ లోక్‌సభ అభ్యర్థి అయినా తాను ప్రచారం చేయనని, కాంగ్రెస్‌ అభ్యర్థులకే అండగా ఉంటానన్నారు. కుమారుడు ప్రచారం ప్రారంభించిన తర్వాత ఉండలేకపోయిన సురేష్‌ కుమారునికి బాసటగా నిలిచారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని చాలాసార్లు చెప్పిన ఆయన కుమారుని వెంట తిరగడం ఉన్నతాశయాలు గల యువనేతగా ఓటర్లకు వివరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పీసీసీ నేతలు సురేష్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. వివరణ అడిగారు. దీనిపై విలేకరులు ఆదివారం భువనేశ్వర్‌లో సురేష్‌ను అడగ్గా, తాను తప్పేమీ చేయలేదని, కొడుకు ఉత్తముడని చెప్పడం బిజద తరఫున ప్రచారం చేయడం తప్పు కాదని సమర్థించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని