logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు

Published : 19 Apr 2024 01:02 IST

నష్టపరిహారం డిమాండుతో రాస్తారోకో

జాతీయ రహదారిపై గ్రామస్థుల రాస్తారోకో

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు గొళంత్రా దళితవాడకు చెందిన రోహిత్‌ దాస్‌ (28), కాళియా దాస్‌ (20)లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలకు పరీక్షలు చేయించి గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్లతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మధ్యాహ్నం మృతదేహాలతో గొళంత్రా సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మృతులిద్దరూ ఓ రాజకీయ పార్టీ ర్యాలీలో మృత్యువాతపడ్డారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి తన వాహనంలో ఎమ్కేసీజీకి తరలించిన సంగతి తెలిసిందే. నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకర్ని విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అధికారుల హామీతో..: గ్రామస్థుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజెప్పారు. బాధిత కుటుంబాలకు రూ.20 వేల చొప్పున రెడ్‌క్రాస్‌ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు. త్వరలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.


కర్ణాటకలో గంజాయి పంట నిందితుడి అరెస్టు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: గంజాయి పండిస్తున్న నేరంపై కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని కలిమెల పోలీసులు అరెస్టు చేశారు. గురువారం మల్కాన్‌గిరి ఎస్పీ నితిశ్‌ వధ్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన లోహిత్‌ అత్గుర్‌ సదాశివ్‌, మల్కాన్‌గిరి జిల్లా ఎంవీ 90 గ్రామానికి చెందిన అసిత్‌ మండల్‌లు కలిసి కలిమెల ఠాణా పరిధి గురాలుడ్‌ సమీప కొండపై, అడవిలో గంజాయి పండిస్తున్నారు. పోలీసులు జనవరి 28న గంజాయి పంట ధ్వంసం చేయడంతోపాటు మండల్‌ను అరెస్టు చేసి ఆరా తీయగా, తనతోపాటు సదాశివ్‌ హస్తం ఉన్నట్లు తెలిపాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కర్ణాటకలో నిందితుడు సదాశివ్‌ను సోమవారం అరెస్టు చేసి, బుధవారం మల్కాన్‌గిరి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

పట్టుబడిన చోరులు: జయపురం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రసాద్‌రావుపేటలో జరిగిన చోరీకి సంబంధించి పోలీసులు గురువారం అయిదుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ముగ్గురు బాలురు, ఒక బంగారు వ్యాపారి, మరో వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిబ్రవరి 29న ప్రసాద్‌రావుపేటకు చెందిన ఎ.రాహుల్‌ పాత్ర్‌ ఇంట్లో చోరీ జరిగింది. చెవిపోగులు, 50 గ్రాముల బంగారు బిస్కెట్‌, రూ.లక్ష నగదు చోరీ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గురువారం నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరిలో కుంబర్‌సాహికి చెందిన కృష్ణముదులి, దుంగగూడకు చెందిన బంగారు వ్యాపారి ఎం.పరీక్షిత్‌రావు ఉన్నారు. వారి నుంచి చెవి పోగు, 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.  


దోపిడీయత్నం భగ్నం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర పోలీసు జిల్లా నిమ్మఖండి ఠాణా పరిధిలో శ్రీక్షేత్రవిహార్‌లోని ఖాళీ స్థలంలో ఇసుక డంపింగ్‌ యార్డు వద్ద బుధవారం అర్ధరాత్రి కొందరు నేరచరిత్ర గల యువకులు దోపిడీకి పథక రచన చేస్తున్నట్లు గస్తీ పోలీసులకు సమాచారం అందింది. వారు రాత్రి 1.20 గంటలకు దాడి చేసి నలుగురు యువకుల్ని పట్టుకున్నారు. వారి నుంచి దేశీయ తయారీ పిస్తోలు, తూటాలు, చరవాణులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు చీకట్లో తప్పించుకోగా వారి కోసం గాలిస్తున్నారు.


అనుమానాస్పదంగా యువతి మృతి

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సమితి క్రిస్టియన్‌ సాహికి చెందిన యువతి దియాక్షి బెనియా (26) అనుమానాస్పదంగా గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇందుకు కారణం అనంతదాస్‌ అని అనుమానంతో సాహికి చెందిన ఓ ముఠా ఆయన ఆటో, గృహోపకరణాలు ధ్వంసం చేశారు. అనంత్‌, అతని స్నేహితులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. రక్తపుమడుగుల్లో ఉన్న అనంత్‌, అతని స్నేహితులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దియాక్షి అనారోగ్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరింది. గురువారం ఆమె మృతి చెందడం, అనంతరం అనంత్‌పై దాడి చేయడంతో రెండు ఘటనలకు సంబంధం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు