logo

భాజపా మోదీ మంత్రం.. బిజద అభివృద్ధి అస్త్రం

ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.

Published : 20 Apr 2024 02:52 IST

భాజపా, బిజదల ఎన్నికల ప్రచారం
పది గ్యారంటీల పల్లవి ఆలపిస్తున్న కాంగ్రెస్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.

డబుల్‌ ఇంజిన్‌ రాగాలాపన... భాజపా నేతలు డబుల్‌ ఇంజిన్‌ రాగాలాపన చేస్తున్నారు. యువత, మహిళల ప్రయోజనాలను ఆయన ధ్యేయంగా చేసుకున్నారని, రాష్ట్రం, దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడ్డారని వివరిస్తున్నారు. నవీన్‌ పట్నాయక్‌ పాలనా వైఫల్యాలు ఏకరువు పెడుతున్న నేతలు ఈసారి మార్పునకు ఓటర్లు శ్రీకారం చుట్టాలని పిలుపునిస్తున్నారు.

అండగా నవీన్‌

ప్రజలు దేవుళ్లు, పాలకులు సేవకులన్న సత్యాన్ని జీర్ణించుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నాలుగున్నర కోట్ల ప్రజలకు అండగా ఉన్నారని బిజద నాయకులు ప్రచారం చేస్తున్నారు. 24 ఏళ్లుగా స్థిరమైన పాలన అందించిన ఘన చరిత్ర ఆయనకే చెందిందని, రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా మరో అయిదేళ్లు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

మాట తప్పం... చెప్పింది చేస్తాం

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పది గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను ఉదాహరణగా ప్రస్తావిస్తున్న వారంతా ధరలు నియంత్రణలోకి తెస్తామంటున్నారు. యువతకు ఉపాధి కల్పన గ్యారంటీ అంటున్న ఆ పార్టీ పెద్దలు సుపాలనకు కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని కోరుతున్నారు.

ప్రచారానికి అగ్రనేతలు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ప్రచారానికి వస్తున్నట్లు భాజపా అధికార వర్గాలు తెలిపాయి. నవీన్‌ ప్రచార రథం సిద్ధమవుతోంది. గతసారి మాదిరిగా అన్ని జిల్లాల్లో ఆయన రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఈసారి ఆయన వెంట వి.కార్తికేయ పాండ్యన్‌ పాల్గొంటారని తెలిసింది. కొంతమంది సినీతారలను పిలిపించి మాట్లాడిన నవీన్‌ వారిని ప్రచారంలోకి దించనున్నారు. కాంగ్రెస్‌ ప్రచారంలో వెనుకంజలో ఉంది. ఈ నెలాఖరులో అగ్రనేతలు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఇతర నాయకులు ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.


30 వరకు ప్రచారం

రాష్ట్రంలో మే 13, 20, 25, జూన్‌ 1న నాలుగు విడతల పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 30 వరకు ప్రచారం కొనసాగనుంది. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. మేలో ఇంకా పెరుగుతాయని, వడగాడ్పులు వీస్తాయని, ఉక్కపోత తీవ్రమవుతుందని వాతావరణ అధ్యయనశాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితిలో రాజకీయ పార్టీ ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలకు ఇబ్బందులు తప్పవని పరిశీలకులంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు