logo

నువ్వా... నేనా

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్‌ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్‌, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Published : 08 May 2024 01:22 IST

కొరాపుట్‌లో మారిన రాజకీయ సమీకరణ

 

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్‌ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్‌, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో బిజద, కాంగ్రెస్‌, పట్టణ ప్రాంతంలో బిజద, భాజపాల మధ్య పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిజద అభ్యర్థి రఘురామ్‌ పడాల్‌కు ఆ పార్టీ నేతల సహకారం అందడం లేదు. నియోజకవర్గంలో వ్యతిరేకత కూడా ఉంది. గతం కంటే బిజద పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, 5టీ ఛైర్మన్‌ కార్తికేయ పాండ్యన్‌లు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఎంతవరకు అనుకూలంగా మారుతుందో చూడాలి.

ప్రచారంలో కుల్‌దీప్‌ వెనుకంజ

కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ కుల్‌దీప్‌ ప్రచారంలో వెనుకబడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయలేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘురామ్‌ మచ్చో ప్రచారం తీరు సరిగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులు కర్పూర్‌ హంటల్‌ (ఆమ్‌ ఆద్మీ పార్టీ), భాగీరథి పట్నియ (స్వతంత్ర)తో భాజపాకు తలనొప్పిగా మారింది. వీరి వల్ల ఓట్లు చీలే అవకాశం ఉంది. అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో నువ్వా, నేనా అన్నట్లు పోటీ ఉంది. కొరాపుట్‌, సునాబెడ పురపాలక సంఘాలు, లమతాపుట్‌, కొరాపుట్‌, బొయిపరిగూడ సమితులతో కూడిన ఈ నియోజకవర్గంలో 1,90,341 మంది ఓటర్లు ఉన్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో బిజద

2019 ఎన్నికల్లో బిజద అభ్యర్థి రఘురామ్‌ పడాల్‌ గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ కుల్‌దీప్‌ 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. భాజపా అభ్యర్థి త్రిపురా గరడ మూడో స్థానంలో నిలిచారు. 2022లో జరిగిన పురపాలక ఎన్నికల్లో కొరాపుట్‌, సునాబెడ పురపాలకల్లో బిజూ జనతాదళ్‌ పార్టీదే పైచేయి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, 60 శాతం మంది కౌన్సిలర్లు బిజదకు చెందినవారే. ఆ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో లమతాపుట్‌, బొయిపరిగుడ సమితిల్లో సమితి అధ్యక్షులు, 80 మంది ప్రజా ప్రతినిధులు కూడా బిజద అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలో బిజద స్థితి మొన్నటి వరకు మెరుగ్గా ఉన్నా, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటిని అధిగమించి రఘురామ్‌ గెలుపొందుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌, భాజపాలు గట్టి పోటీ ఇవ్వనున్నాయా లేదా అన్నది కూడా సంశయమే. ప్రధాని మోదీ నవరంగపూర్‌లో చేసిన ప్రచారం ఇక్కడ అభ్యర్థి విజయానికి సాయపడుతుందో లేదో వేచి చూడాలి. మొత్తంగా కొరాపుట్‌ నియోజకవర్గం ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు