logo

రామరాజ్యం భాజపా ధ్యేయం

రామరాజ్యం సుభిక్షానికి మరో పేరని, 500 ఏళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామాలయం నిర్మాణమైందని, కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్ష నెరవేర్చిన మోదీ పాలనా ఫలాలు ప్రతి వ్యక్తి ముంగిళ్లకు చేర్చాలని అహరహం శ్రమిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

Published : 09 May 2024 04:22 IST

‘వికసిత్‌ భారత్‌‘ ప్రధాని మోదీ ధ్యేయం
ఈసారి ఒడిశాలో కమలాలు వికసిస్తాయి
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌

భవానీపాట్నాలో ప్రసంగిస్తున్న రాజ్‌నాథ్‌సింగ్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రామరాజ్యం సుభిక్షానికి మరో పేరని, 500 ఏళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామాలయం నిర్మాణమైందని, కోట్లాదిమంది భారతీయుల ఆకాంక్ష నెరవేర్చిన మోదీ పాలనా ఫలాలు ప్రతి వ్యక్తి ముంగిళ్లకు చేర్చాలని అహరహం శ్రమిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం కలహండి జిల్లా భవానీపాట్నాలో భాజపా విజయసంకల్ప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధన రానున్న అయిదేళ్లలో సాకారమవుతుందని, మోదీ పాలనలో ఇది సాధ్యమని చెప్పారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్య్రరేఖ దాటి వెలుగురేఖలు చూడగలిగారన్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ‘గరీబీ హఠావో’ నినాదంగా చేసుకున్నారని, వారి మొత్తం పాలనలో జరగని ప్రగతి గడిచిన పదేళ్లలో మోదీ చేసి చూపించారన్నారు. 80 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు. 370వ అధికరణ రద్దు చేసి జమ్ముకశ్మీరానికి స్వేచ్ఛ, తీన్‌ తలాక్‌ చట్టం నుంచి ముస్లిం సోదరినులకు విముక్తి కల్పించడం వంటి సాహసోపేత చర్యలు తీసుకున్న మోదీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారని, దీంతో సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జవానుల శక్తి, ధైర్య సాహసాలు ప్రపంచ దేశాలు చూశాయన్నారు.

పేదరికానికి బిజద, కాంగ్రెస్‌ కారణం

గతంలో ఒడిశాలోని కలహండి ఆకలిచావులు జిల్లాగా, దారిద్య్రానికి చిరునామాగా మారిన సమయంలో పాత్రికేయులు రాసిన కథనాలు తాము చదివినట్లు రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌, 25 ఏళ్ల బిజద ఈ రాష్ట్రాన్ని పాలించాయని, ప్రాంతీయ అసమానతలు, పేదరికానికి ఈ రెండు పార్టీల పాలకులు జవాబుదారీ అన్నారు. కేంద్రం ఈ రాష్ట్రానికి భారీగా కేటాయింపులు చేస్తున్నా నిధులు సద్వినియోగానికి కావడం లేదని, అవినీతి పెరిగిందన్నారు.

వేదికపై కేంద్రమంత్రికి గజమాలతో సత్కారం

మేనిఫెస్టో సంఘానికి అధ్యక్షుడ్ని

భాజపా ఇతర పార్టీల్లా కాదని, చెప్పింది చేస్తుందన్నారు. ప్రజాహితానికి, సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి భాజపా ప్రకటించిన మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ అమలవుతాయన్నారు. తాను మేనిఫెస్టో సంఘానికి అధ్యక్షుడ్ని అని, అందులో చెప్పినవన్నీ చిత్తశుద్ధితో ప్రజల ముంగిళ్లకు చేరుస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని