logo

ఒడిశా వాసులు అభివృద్ధి ట్రైలర్‌ చూశారు

ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్‌ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు.

Updated : 10 May 2024 06:40 IST

పూర్తి సినిమా ముందు ముందు చూపిస్తామన్న గడ్కరీ

కృష్ణప్రసాద్‌లో ప్రసంగిస్తున్న గడ్కరీ

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్‌ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. గురువారం మధ్యాహ్నం పూరీ వచ్చిన ఆయన భాజపా పూరీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్‌ పాత్ర్‌తో కలసి శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. తర్వాత బ్రహ్మగిరి అసెంబ్లీ నియోజకవర్గం లోని కృష్ణప్రసాద్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు.

పదేళ్లలో రూ.50 లక్షల కోట్లు పనులు: కేంద్రంలో పదేళ్లుగా మంత్రిగా ఉన్న తాను దేశంలో రూ.50 లక్షల కోట్ల వ్యయంతో కూడిన నిర్మాణాలు చేయించినట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో పరదీప్‌ పోర్టు విస్తరణ, ఇతర నిర్మాణాలకు రూ.5 లక్షల కోట్లు ఖర్చయ్యాయన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలు ధ్యేయంగా కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఒడిశాలో రహదారుల విస్తరణ, రింగ్‌ రోడ్ల పనులు జరిగాయని వాటి వివరాలు పేర్కొన్నారు. రాయ్‌పూర్‌- విశాఖ ఆర్థిక కారిడార్‌, ముంబయి-కోల్‌కతా కారిడార్‌ల నిర్మాణాలతో రాష్ట్రానికి లాభించిందన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత భువనేశ్వర్‌కి  సంబంధించి 111 కిలోమీటర్ల ఆరు లైన్ల రింగ్‌ రోడ్‌ పనులు రూ.6,500 కోట్ల వ్యయంతో జరుగుతాయని వివరించారు. సంబల్‌పూర్‌ నగరంలో రింగ్‌రోడ్‌ రూ.1,330 కోట్లతో జరగనుందన్నారు. ఈ రిక్షా, ఈ-బస్‌ సేవలు, ఇథనాల్‌తో నడిచే వాహనాల రూపకల్పన తమ హయాంలో సాధ్యమైందని వివరించారు.

శ్రీక్షేత్రం సింహద్వారం ఆవరణలో నితిన్‌ గడ్కరీ, సంబిత్‌ పాత్ర్‌

చిలికాపై వంతెన తథ్యం: కృష్ణప్రసాద్‌వాసులు పూరీ, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చిలికా ఆధారం కాగా పడవల్లో రాకపోకలు చేస్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారని తమ దృష్టికొచ్చిందన్నారు. దీనివల్ల గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందన్నది వాస్తవమని, గోపాల్‌పూర్‌-దిఘా తీర మార్గం (కోస్టల్‌ హైవే) పనులు త్వరలో ప్రారంభిస్తున్నామని, ఈ మార్గానికి సంధానిస్తూ 5 కిలోమీటర్ల వంతెన నిర్మాణం పనులు చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు