logo

ఆయుష్మాన్‌ మంత్రం ఫలించేనా?

ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది.

Published : 10 May 2024 03:17 IST

ఆరోగ్య భరోసా పథకం ప్రచార అస్త్రంగా ముందుకెళ్తున్న భాజపా
రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

ప్రసంగిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది. బుధవారం రాయగడ, కలహండి జిల్లాలో భాజపా నిర్వహించిన విజయసంకల్ప సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనినే ప్రస్తావించడం గమనార్హం. రాష్ట్రంలో కాషాయం పార్టీకి అధికారమిస్తే, బిజద విస్మరిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేస్తామని ఆయన నొక్కి చెప్పారు. 70 ఏళ్లు, ఆ పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చి, వారికి ఉచితంగా మెరుగైన చికిత్స అందేలా చూస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. ఒడిశాలో నవీన్‌ సర్కార్‌ అమలు చేస్తున్న ఆరోగ్య భరోసా పథకంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, బాధితులకు లబ్ధి చేకూరడం లేదని మంత్రి సింగ్‌ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా లబ్ధిదారులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.

ప్రతి కుటుంబానికి దక్కేలా

భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ వంటగ్యాస్‌ అనుసంధానంతోపాటు తాగునీటి సరఫరా అందిస్తామని హామీ ఇస్తూ, సగటు ఓటరుని ఆలోచనలో పడేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టీకాల సేకరణ, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించడంలో ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను పూసగుచ్చినట్లు వివరించిన రాజ్‌నాథ్‌ ప్రసంగం సగటు ఓటరుని ఆకట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సమస్యలు, మోదీ సర్కార్‌ సాధించిన ఘనత తదితర అంశాలపై మంత్రి వివరించిన తీరు భాజపా ప్రచారానికి మరింత ఊతమిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్‌నాథ్‌ పర్యటనతో పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసే చివరి క్షణంలో ఓటరు ఆలోచన తీరుపై ఇది ఎంతవరకు సానుకూల ప్రభావం చూపుతుందో అన్నది చూడాలి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని