logo

916 గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు

వర్షాకాలం ప్రారంభంలోనే మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రితో పాటు సాలూరు సీహెచ్‌సీ, మరికొన్ని పీహెచ్‌సీల్లో రోగులు కిటకిటలాడుతున్నారు. ఒక్కో మంచంపై ఇద్దరికి చొప్పున చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మున్ముందు

Published : 28 Jun 2022 04:36 IST

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: వర్షాకాలం ప్రారంభంలోనే మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రితో పాటు సాలూరు సీహెచ్‌సీ, మరికొన్ని పీహెచ్‌సీల్లో రోగులు కిటకిటలాడుతున్నారు. ఒక్కో మంచంపై ఇద్దరికి చొప్పున చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మున్ముందు రాకుండా గ్రామాల్లో చర్యలు చేపట్టినట్లు డీఎంహెచ్‌వో జగన్నాథరావు తెలిపారు. టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ లాంటి జ్వరాలకు కారణమైన దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లాలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ‘న్యూస్‌టుడే’కు తెలియజేశారు.

158 గ్రామాలపై ప్రభావం..

జిల్లాలోని 158 గ్రామాల్లో మలేరియా ప్రభావం ఉన్నట్లు గుర్తించాం. 2021లో ఉమ్మడి జిల్లాల్లో 103 మలేరియా, 270 డెంగీ కేసులు నమోదయ్యాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి జ్వరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 11 మలేరియా, 50 డెంగీ కేసులొచ్చాయి. వీటిని కట్టడి చేసేందుకు జిల్లాలోని 916 గ్రామాల్లోనూ డ్రైడే పాటించేలా అవగాహన కల్పించాం. పరిసరాల్లో నీరు నిల్వలు లేకుండా చూడటం, దోమ లార్వా నాశనం చేయడం, దోమ తెరలు వినియోగించేలా చూస్తాం.

కొవిడ్‌పై అప్రమత్తం

ఇటీవల పలు చోట్ల కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీనిలో భాగంగా జిల్లాలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మాస్కులధారణ, శానిటైజేషన్‌, దూరం పాటించడం మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా ఎవరైనా టీకాలు వేసుకోకపోతే సమీప పీహెచ్‌సీలోసంప్రదించాలి. ఇప్పటికే గ్రామాల్లో జ్వరాల సర్వే చేపట్టాం. కేసులు నమోదైతే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నాం.

పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..

వర్షాకాలంలో  గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాచిన నీటినే తాగాలి. ఇళ్ల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగితే పచ్చకామెర్లు, అతిసారం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నెల 23 వరకు గ్రామాల్లో అవగాహన కల్పించాం. దీంతో పాటు రోగులకు అందుబాటులో ఉండేలా 37 పీహెచ్‌సీల్లో 24 గంటల పాటూ సేవలు అందిస్తున్నాం. వైద్యులు లేని మూడు చోట్ల డిప్యుటేషన్‌పై నియమించాం.

దోమ తెరలపై అవగాహన  

మలేరియా, డెంగీ జ్వరాలు బయట పడిన వెంటనే బాధితులకు తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో నమూనాలు సేకరించి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల కొమరాడ మండలం సర్వపాడులో మలేరియా కేసులు బయట పడిన వెంటనే శిబిరాలు ఏర్పాటు చేయించాం. తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరిచాం. ఆశా వర్కర్లను అప్రమత్తం చేశాం. కొన్ని గ్రామాల్లో దోమ తెరలను వినియోగించకుండా మొక్కలకు రక్షణగా పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.  

రక్తలేమి కేసులు..

జిల్లాలో రక్తహీనతతో మాతృశిశు మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవానికి వచ్చే 60 శాతం మంది మహిళల్లో ఈ సమస్య కనిపిస్తోంది. 14 గ్రాముల హెచ్‌బీ ఉండాల్సిన చోట 11 గ్రాముల లోపు ఉంటోంది. అంగన్‌వాడీల్లో అందించే పోషకాహారం సక్రమంగా తింటే రక్తలేమిని అధిగమించొచ్చు. నెలలో ఇచ్చే 30 గుడ్లు ఇంటిల్లిపాది కాకుండా గర్భిణి మాత్రమే తినాలి. దీంతోపాటు పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో పీహెచ్‌సీలో 10 వరకు జరగాలని లక్ష్యాలు  నిర్దేశించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని