logo

కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా

ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు.

Published : 27 Apr 2024 05:34 IST

ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. జిల్లాలో జీవగెడ్డల నుంచి వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించేందుకు గత ప్రభుత్వాలు జిల్లాలో పదికి పైగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశాయి. కొన్నాళ్లు బాగానే పనిచేసినా  నిర్వహణ లేక మూలకు చేరాయి.

 న్యూస్‌టుడే, పార్వతీపురం,  గుమ్మలక్ష్మీపురం

మాటలు..

రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా.  సాగునీటి వనరుల నిర్మాణాలు చేపట్టి పుష్కలంగా నీరు అందిస్తున్నాం.

 పలు వేదికలపై ముఖ్యమంత్రి జగన్‌

చేతలు..

మన్యం జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల్లోని మెట్ట, బీడు భూములకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాలను నిర్మించాయి. అన్ని చోట్లా ఇవి మూలకు చేరినా వైకాపా అయిదేళ్ల పాలనలో ఎటువంటి మరమ్మతులు లేవు.

కాట్రగడ(బి) వద్ద వేసిన శిలాఫలకం

4800 ఎకరాల ఎదురుచూపు

భామిని, న్యూస్‌టుడే: వంశధార నుంచి వస్తున్న నీరు వృథాగా సముద్రంలో కలిసిపోకుండా గత ప్రభుత్వ హయాంలో కిమిడి కళావెంకటరావు మంత్రిగా ఉన్న సమయంలో మండలంలోని పాలవలస, వడ్డంగి వద్ద ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించారు.

  • వడ్డంగి, నేరడి, నులకజోడు గ్రామాల్లోని 2,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా గజపతిసాగరం వద్ద పథకం ఏర్పాటుకు రూ.33 కోట్లతో శంకుస్థాపన చేశారు.
  • కాట్రగడ(బి) సమీపంలో మనుమకొండ, పాలవలస, బొమ్మిక, కాట్రగడ(బి) గ్రామాల్లోని 2,300 ఎకరాలకు నీరిచ్చేలా రూ.18.10 కోట్లతో అంచనాలు తయారు చేసి భూమిపూజ చేశారు. అనంతరం ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు ముందుకు కదలలేదు. దీంతో 13 పంచాయతీల ప్రజలు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.  

అయిదేళ్లలో నిధులేవీ

పైపులైను కుండీ వద్ద మరమ్మతులు చేస్తున్న సిబ్బంది(పాతచిత్రం)

సీతానగరం, న్యూస్‌టుడే: మండలంలోని గాదెలవలస వద్ద సువర్ణముఖి నది నుంచి రెండు దశల్లో నీరు సరఫరా చేసి 450 ఎకరాలకు అందించేలా 1993లో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. స్టేజ్‌-1 నుంచి స్టేజ్‌-2కు నీరు పంపించే కాలువ తవ్వకంతో సరఫరా అరకొరగా ఉండేది. ఈ స్థానంలో పైపులైను ఏర్పాటు చేశారు. కానీ తరచూ మరమ్మతులు, పైపులైను లీకవడంతో గాదెలవలస, బూర్జ, ఆవాలవలస, జె.రాయపురానికి చెందిన 500 మంది చిన్న, సన్నకారు రైతుల సంఘం తరఫున పనులు చేసుకునేవారు. కానీ అయిదేళ్లుగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో గోగు, వేరుసెనగ పంటలపై ఆధారపడే వారు ఇబ్బందులు పడుతున్నారు.  

మూడేళ్లుగా మూలనే

బలిజిపేట: బలిజిపేట మండలంలోని అంపావల్లిలో రూ.1.20 కోట్లతో వీరాంజనేయ ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు 2001లో అప్పటి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు నిధులు మంజూరు చేయించారు. వేగావతి నది నుంచి 518 ఎకరాల ఆయకట్టుకు నీరు మళ్లేలా బావి ఏర్పాటు చేశారు. ఆయకట్టు మొత్తానికి అందకపోవడంతో పైపులైన్లు మార్చాలని నిర్ణయించారు. తెదేపా కాలంలో మంత్రి మృణాళిని వద్దకు రైతులు వెళ్లగా రూ.కోటి మంజూరు చేశారు. రెండేళ్ల పాటు సక్రమంగా సాగునీరు వెళ్లగా తర్వాత నిర్వహణ వదిలేశారు. దీంతో మూడేళ్లుగా మూలకు చేరింది.

అడారు అలంకారప్రాయం

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం, మక్కువ మండలాల్లోని 650 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మినీ జలాశయం నిర్మించాలని 2006లో భావించారు. వివిధ కారణాలతో పనులు ఆలస్యం కావడంతో తాత్కాలికంగా వంద ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా 2012లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. మొదటల్లో దిగువ అడారు, ఎగువ అడారు, గుడారివలస, గదబవలసకు చెందిన రైతులు లబ్ధి పొందేవారు. కొన్నాళ్లకు మోటార్లు పాడయ్యాయి. ఒకటి, రెండు సార్లు బాగు చేసినా తర్వాత పట్టించుకోలేదు. దీంతో మూడేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని