logo

193 ప్రాజెక్టులకే అవకాశం

ఇన్‌స్పైర్‌లో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నా, వారి ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో చోటు దక్కడం లేదు. దీంతో పోటీకి అవకాశం లేకుండా పోతోంది. ఏటా నామినేషన్ల స్థాయిలో అర్హత పొందినవి చూస్తే నిరాశకు లోనవ్వాల్సిందే.

Updated : 30 Jan 2023 06:23 IST

ఇన్‌స్పైర్‌ మనక్‌కి ఉమ్మడి జిల్లాలో ఎంపిక

సైన్స్‌ ప్రదర్శనల్లో విద్యార్థులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇన్‌స్పైర్‌లో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నా, వారి ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో చోటు దక్కడం లేదు. దీంతో పోటీకి అవకాశం లేకుండా పోతోంది. ఏటా నామినేషన్ల స్థాయిలో అర్హత పొందినవి చూస్తే నిరాశకు లోనవ్వాల్సిందే. 2022-23లో ఉమ్మడి జిల్లాలో 193 ప్రాజెక్టులే అర్హత సాధించాయి. విజయనగరం 134, మన్యంలో 59 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది.

వివరాలిలా...

కేంద్ర ప్రభుత్వం 2010-11 నుంచి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ విజ్ఞాన ప్రదర్శన నిర్వహిస్తోంది. 2018లో ఇన్‌స్పైర్‌ మనక్‌గా దీని పేరును మార్చారు. విద్యార్థులు నేరుగా ప్రాజెక్టు వివరాలను ఆన్‌లైన్‌ చేయాలి. ఆ మేరకు ఎంపిక చేసిన ప్రాజెక్టులనే ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా విద్యార్థుల ప్రాజెక్టులు తక్కువ స్థాయిలో అర్హత పొందుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంపికైన వాటిలో అతి తక్కువ ప్రాజెక్టులు ఇక్కడ నుంచే ఉంటున్నాయి. జిల్లా పునర్విభజన జరిగాక కూడా పెద్దగా పురోగతి లేదు.

తొలిసారిగా ఆన్‌లైన్‌లో ప్రదర్శనలు

తొలుత ఎంపిక చేసిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో ప్రదర్శించేవారు. గతంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖలో నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా 2021-22 ఏడాదిలో పోటీలు జరగలేదు. వీటిని  ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల ప్రాజెక్టులను ఫిబ్రవరి మొదటివారంలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఇప్పటికే ఆదేశించారు.

పెంచాలన్న డిమాండు

విద్యార్థుల ప్రాజెక్టులు తక్కువగా ఎంపికవ్వడంపై భిన్న వాదనలను విద్యాశాఖ వినిపిస్తోంది. ఏపీకి కోటాను నిర్దేశించడం, ఆల్ఫాబెటికల్‌(ఆంగ్ల అక్షరం వరుసలో) క్రమం ఎంపికతో తక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు కేటాయిస్తున్నారని భావిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభపాటవాల నేపథ్యంలో వీటి సంఖ్య పెంచాలన్న డిమాండు ఆదిగా ఉంది. ప్రాజెక్టు వివరాలు ఆయా పాఠశాలల్లో నమోదులో తప్పులు దొర్లడం, బ్యాంకు ఖాతాలు తల్లిదండ్రులవి ఇవ్వడం, వివిధ సాంకేతిక సమస్యల వల్ల అర్హతను కోల్పోతున్నాయంటున్నారు. తక్కువ సంఖ్యలో ఎంపికపై  రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని సైన్స్‌ సమన్వయకర్తలు మిరియాల కృష్ణారావు, సత్యారావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని