logo

ఇలాగున్నాయ్‌ కాలనీళ్లు

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో  చేపట్టిన గృహాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.

Updated : 26 Mar 2023 06:36 IST

-ఈనాడు, విజయనగరం, టాస్క్‌ఫోర్స్‌ బృందం

గుంకలాంలో నిర్మాణంలో ఉన్న గృహాలు 

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో  చేపట్టిన గృహాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి పనుల వేగవంతానికి   ఆదేశాలిస్తున్నా.. జిల్లా, మండల స్థాయి అధికారులు పట్టాలు రద్దు చేస్తామని ఒత్తిడి తెస్తున్నా వేగవంతం లేదు. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలు సరిపోక చాలా మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించక ముందే చేతులెత్తేశారు. కొందరు అప్పోసప్పో చేసికట్టుకుంటున్నారు.  మరికొందరు ప్రభుత్వం ఎంపిక చేసిన గుత్తేదారుకు ఆ బాధ్యతలు అప్పగించారు.


అతిపెద్ద లేఅవుట్‌లో ప్రగతి ఇదీ

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద లేఅవుట్‌ గుంకలాంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020 డిసెంబరు 30న పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ 10,650 ఇళ్లు మంజూరు చేయగా 2,650 మంది లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. రాక్రీట్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించిన ఎనిమిది వేల గృహాల్లో 3,448 ప్రారంభానికి నోచుకోలేదు. 12 పైకప్పు వరకు పనులు జరిగాయి. లబ్ధిదారులు చేపట్టిన వాటిలో 1,505 వివిధ దశల్లో ఉండగా 166 పూర్తయ్యాయి. 979 ఇంకా ప్రారంభించాలి. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ల ఒత్తిడితో చాలా మంది పునాదులు తీసి వదిలేస్తున్నారు. సాంకేతిక సమస్యతో బిల్లుల చెల్లింపులో జాప్యం అవుతోందని గృహ నిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతం నగరానికి పది కి.మీ పైగా ఉండటం.. మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.


బిల్లు ఇస్తేనే పని

నేను ఇంటి నిర్మాణం ప్రారంభించి రూ.35 వేలు ఖర్చు చేశా. ఇసుక రవాణాకు రూ.1,100 చెల్లించా. ఇల్లు పూర్తి చేసేందుకు రూ.8 లక్షలు కానుంది. చేసిన పనికి బిల్లు రాలేదు. అప్పు పుట్టడం లేదు. ప్రభుత్వం బిల్లు ఇస్తే పనులు వేగవంతం చేస్తా.

 ఓ లబ్ధిదారుడు


ఎనిమిది చోట్ల ఆ ఊసే లేదు

* నియోజకవర్గంలో 115 కాలనీలు మంజూరు చేశారు. గజపతినగరం, గంట్యాడ, దత్తిరాజేరు మండలాల్లోని ఎనిమిది లేఅవుట్లలో పనులు ప్రారంభించలేదు. మొత్తం పది కాలనీలకే రోడ్లు ఏర్పాటు చేశారు.
* గజపతినగరం మండలం పురిటిపెంటలో 189 గృహాలు నిర్మిస్తున్నారు. అంతర్గత రహదారులు ఉన్నప్పటికీ, ఈ గ్రామం నుంచి గానీ 26వ నంబరు జాతీయ రహదారి నుంచి మార్గం లేదు. రైల్వే కాలనీకి ఉన్న రహదారినే వినియోగించాలి. రైల్వే శాఖ అభ్యంతరం చెబితే ఈ కాలనీ వాసులు కదిలే పరిస్థితి లేదు. నిత్యం రైల్వే గేటు మూసి ఉంటుంది. ఆదివారం గేటు తీసేందుకు ఎవరూ ఉండరు. రోజంతా వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ప్రత్యేకంగా రహదారి ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


పునాది రాయి పడలేదు

నియోజకవర్గం మొత్తం 121 కాలనీలు కాగా పూసపాటిరేగ మండలంలో 3059 గృహాలకు 974 పూర్తయ్యాయి. పూసపాటిపాలెం, పేరాపురం, చోడమ్మ అగ్రహారం, కొల్లాయివలస, గోవిందపురం, కొవ్వాడ అగ్రహారం తదితర గ్రామాల్లోని కాలనీల్లో ఒక్క పునాది రాయీ పడలేదు. వీటిలో కొన్ని ఊరికి దూరంగా ఉండగా మరికొన్ని కొండ ప్రాంతాల్లో కేటాయించడంతో వాటిని పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
* భోగాపురం మండలం సుందరపేటకు వెళ్లే రహదారిలో ఉన్న లేఅవుట్‌లో 56 గృహాలకు 10 మందికి పైగా పనులు ప్రారంభించిన తర్వాత ఆ భూమి తమ పేరుపై ఉంటే అధికారులు  లేఅవుట్‌ వేశారంటూ కొందరు న్యాయస్థానాన్ని           ఆశ్రయించారు.
* భోగాపురం జాతీయ రహదారికి 300 మీటర్ల దూరంలో ఉన్న సిమ్మపేటలో నిర్మాణాలు వేగంగా జరుగుతున్నా.. రహదారికి మోక్షం కలగలేదు.


ఆ మూడింట...

* నియోజకవర్గంలోని 30 లేఅవుట్లకు పెదఖండేపల్లి, వెంకటరమణపేటల్లో లబ్ధిదారులెవరూ ఆసక్తి చూపకపోవడంతో వాటిని రద్దు చేశారు. లబ్ధిదారులు వస్తారని వెంకటరమణపేటలో విద్యుత్తు లైను, నియంత్రిక, బోరు ఏర్పాటు చేయడం గమనార్హం.
* పెదఖండేపల్లిలో కొండ పక్కనున్న కాలనీలో పునాది తవ్వకాల్లో రాయి పడటంతో ఎవరూ నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇక్కడా విద్యుత్తు స్తంభాలు, బోరు వేశారు. వీరికి ప్రత్యామ్నాయం చూపలేదు.
* వేపాడ మండలం ముకుందపురంలో గెడ్డ పక్కన లేఅవుట్‌ స్థలం చదును చేయలేదని లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇది నిరుపయోగంగా ఉంది.
* ఎల్‌.కోట నెం.2 కాలనీకి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో నిర్మాణ సామగ్రి తీసుకెళ్లడానికి లబ్ధిదారులకు అదనపు వ్యయం అవుతోంది.


లక్ష్యానికి దూరం

నియోజకవర్గంలో 92 కాలనీలు మంజూరయ్యాయి. చాలా చోట్ల అంతర రోడ్లు నిర్మాణం  కాలేదు. నీటి ట్యాంకులు అలంకారప్రాయంగా మారాయి. సాలూరు పట్టణ పరిధిలోని గుమడాంలో అయిదు, నెలిపర్తిలో మూడు కాలనీలు వేశారు. గుమడాంలో 1,586 మందికి స్థలాలు కేటాయించారు. రూ.1.60 కోట్లతో అప్రోచ్‌ రోడ్డు, రూ.2.20 కోట్లతో అంతర రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ కాలనీలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లూ పూర్తి కాలేదు. శివరాంపురం, మామిడిపల్లి, తోణాంలో 30 శాతం పనులే జరిగాయి.


జిల్లా కేంద్రం ఇలా..

నియోజకవర్గంలో 11,395 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 4,534 మంది పూర్తి చేశారు. పార్వతీపురం పట్టణంలోని కాలనీల్లో కొంతవరకు అంతర్గత రహదారులు పూర్తి చేయగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రారంభించలేదు.
పాలకొండ పట్టణ పేదలకు కేటాయించిన కాలనీలో 1,245 గృహాలు మంజూరయ్యాయి. పట్టణానికి శివారున లుంబూరుకు వెళ్లే రహదారిలో స్థలం కేటాయించారు. ఇప్పటి వరకు 103 నిర్మాణాలు పూర్తయ్యాయి. 330 మంది లబ్ధిదారులు నేటికీ పనులు ప్రారంభించలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కురుపాం నియోజకవర్గంలోని 24 కాలనీలు ఉన్నాయి. మాదలంగి, గుమడ, కోటిపాంలో పనులు ప్రారంభించలేదు.


అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం

కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అంతర్గత రహదారులు కొన్ని చోట్ల పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల చేస్తాం.                          
 రఘురాం, జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని