logo

అనుమానంతోనే భార్యను చంపేశాడు

ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

Published : 28 Mar 2024 04:06 IST

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను పాలకొండ డీఎస్పీ కృష్ణారావు బుధవారం వెల్లడించారు. గ్రామానికి చెందిన జి.ముసలినాయుడు, అప్పలనరసమ్మ(60) దంపతులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి వివాహాలైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గంగునాయుడు నెల్లూరులో ఉపాధి కోసం వలస వెళ్లాడు. ముసలినాయుడు ఎప్పటికప్పుడు మద్యం తాగి భార్యను అనుమానిస్తూ గొడవకు దిగేవాడు. ఈక్రమంలో ఈనెల 21న ఆమెపై కత్తితో దాడి చేసి, పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. 22న ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం సీఐ బి.మంగరాజు, ఎస్సైలు ఇ.చిన్నం నాయుడు, పి.అనీష్‌ తమ సిబ్బందితో గాలించారు. బుధవారం లక్ష్మింపేటలోని దుర్గగుడి సమీపంలో కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడని డీఎస్పీ చెప్పారు. కత్తిని స్వాధీనం చేసుకున్నామని, అతడ్ని అరెస్టు చేసి పార్వతీపురం కోర్టులో హాజరుపరిచామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని