logo

గిట్టుబాటు దక్కేనా?

ఉపాధి పథకం కింద కేంద్రం అందిస్తున్న రోజు వారీ వేతనం రూ.300లకు పెరిగింది. ఇంతవరకు రూ.272గా ఉండేది. పెరిగిన కూలి ఏప్రిల్‌ 1 నుంచి జరిగే పనులకు వర్తించనుంది.

Published : 30 Mar 2024 02:53 IST

ఉపాధి వేతనం పెంపు

విజయనగరం అర్బన్‌, వీరఘట్టం, సీతంపేట: ఉపాధి పథకం కింద కేంద్రం అందిస్తున్న రోజు వారీ వేతనం రూ.300లకు పెరిగింది. ఇంతవరకు రూ.272గా ఉండేది. పెరిగిన కూలి ఏప్రిల్‌ 1 నుంచి జరిగే పనులకు వర్తించనుంది. ఈ మేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. వేతనదారుల సంఖ్యలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఏటా వేతనాన్ని స్వల్ప మొత్తంలో పెంచుతున్నా ఆ మేరకు గిట్టుబాటు కావడం లేదు. రెండు జిల్లాల్లో చూసుకుంటే సగటు వేతనం తక్కువగానే ఉంటోంది. 2023-24లో విజయనగరం జిల్లాలో రూ.239 ఉండగా.. మన్యంలో రూ.242.11 మాత్రమే నమోదైంది. కొన్ని మండలాల్లో ఆ సంఖ్యలు ఇంకా తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.700 కోట్లు (విజయనగరం- రూ.444.83 కోట్లు, మన్యం- 255.28 కోట్లు) ఖర్చు చేశారు.

సౌకర్యాలేవీ..

కూలీలు నిర్దేశిత వేతనాలు పొందే విషయంలో రెండు జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. పెంచే చర్యలు కొరవడుతున్నాయి. కొన్ని చోట్ల రెండు పూటలా చేయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో ఎక్కువ సేపు ఉంటున్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, ఎండ నుంచి రక్షణ పొందేందుకు పందిళ్లు, పరదాల ఏర్పాటు, పరికరాలు సమకూర్చడం తదితర చర్యలు కానరావడం లేదు. ఈ కారణాలతో గరిష్ఠ వేతనం దక్కడం లేదని తెలుస్తోంది.

ప్రతిబంధకాలివే..

  • వేసవిలో పనులకు వెళ్లే వారి సంఖ్య తగ్గడం
  • ఎండల కారణంగా మట్టి పనులు కష్టంగా మారడం
  • గతంలో రాష్ట్ర ప్రభుత్వం వేసవి భత్యం 20 నుంచి 30 శాతం అమలు చేసేది. ప్రస్తుత ప్రభుత్వం దానిని ఎత్తివేయడం
  • నీరు, మజ్జిగ, పరికరాలకు ఇచ్చిన రాయితీలు ఆపేయడం
  • కేంద్రం నిర్దేశించిన పనులకు చేసిన ప్రతిపాదనలు సాంకేతిక సమస్యలతో సాఫ్ట్‌వేర్‌లో రద్దు కావడం
  • రెండు జిల్లాల్లో 25 పంచాయతీల జీఐడీ కోడ్‌లు సాఫ్ట్‌వేర్‌లో కనిపించకపోవడం

ఇతర పనులకు ప్రాధాన్యం

ఇచ్చిన కొలతల మేరకు పనులు చేయకపోవడంతో సగటు వేతనం తగ్గుతోంది. పని వేళలు తక్కువగా ఉంటున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో చెరువు పనులను 30 శాతానికి పరిమితం చేశాం. నీటి పరిరక్షణ పథకాలు, వ్యక్తిగత పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాం.

ఉమాపరమేశ్వరి, రామచంద్రరావు, పీడీలు, నీటి యాజమాన్య సంస్థ, ఉమ్మడి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని