logo

అయిదు వేల ఇళ్ల రద్దు

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద విజయనగరం జిల్లాలో మంజూరు చేసిన 78,127 గృహాల్లో 40,172 పూర్తి కాగా, పనులు ప్రారంభించనవి 2,263 ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన 27,142 ఇళ్లలో 12,992 పూర్తి చేయగా, 2,725 ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు.

Published : 30 Mar 2024 03:04 IST

కనీసం పునాదికి గోతులు తీయక ఈ నిర్ణయం

ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించని గంట్యాడ మండలంలోని బుడతనాపల్లి-2 లేఅవుట్‌

ఈనాడు-విజయనగరం: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద విజయనగరం జిల్లాలో మంజూరు చేసిన 78,127 గృహాల్లో 40,172 పూర్తి కాగా, పనులు ప్రారంభించనవి 2,263 ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన 27,142 ఇళ్లలో 12,992 పూర్తి చేయగా, 2,725 ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. రెండు జిల్లాల్లో మంజూరు చేసిన 1,05,269 ఇళ్లలో ఇప్పటి వరకు పునాదులకు గోతులు కూడా  తీయని సుమారు 5 వేల ఇళ్లు రద్దు చేశారు. ప్రస్తుతం నివాసానికి దూరంగా స్థలాలు ఇవ్వడం, అక్కడ వసతులు లేకపోవడం, ప్రభుత్వ ఆర్థిక సాయం చాలకపోవడం.. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో గృహాలు ఉన్న వారికే మళ్లీ మంజూరు చేయడం వంటి కారణాలతో లబ్ధిదారులు పనులు ప్రారంభించలేదు. తమకు స్థలముంటే చాలని భావించిన వారున్నారు. వీరంతా కనీసం పునాదికి గోతులు తీయక రద్దయ్యాయి.

ఉభయ జిల్లాల్లో సుమారు 16 వేల ఇళ్లకు పైగా పునాదులకు గోతులు తీసి.. మరో 20 వేల నిర్మాణాలకు పిల్లర్లు వేసి, పునాదులు వేయకుండా వదిలేశారు. పునాది దశకు చేరితేనే బిల్లులు జారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు పునాదులు వేయని 30 వేలకు పైగా ఇళ్లకు ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పనులు చేపట్టినా బిల్లులు వచ్చే అవకాశం లేదు. వాటి కంటే ఎక్కువ ప్రగతిలో ఉన్న వాటికే వివిధ దశల్లో బిల్లులు మంజూరు చేస్తారు.

మూడేళ్లలో 50 శాతం పూర్తి : రెండు జిల్లాల్లో పట్టాలిచ్చి, ఇళ్లు మంజూరు చేసిన మూడున్నరేళ్లలో అతికష్టం మీద 50 శాతం మంది  నిర్మాణాలు పూర్తి చేయగలిగారు. వీటికి వినియోగ ధ్రువపత్రాలు (యూసీ) సమర్పించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశిస్తున్నారు. వాటిని సమర్పిస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ప్రస్తుతం పురోగతిలో ఉన్న వాటిలో పది శాతం లోపే చివరి దశలో మెరుగులు దిద్దుకుంటున్నాయి.

ప్రగతిలో ఉన్న వాటికే డబ్బులు

లబ్ధిదారులకు మంజూరైన వాటిలో పనులు చేపట్టని ఇళ్లు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు చేశారు. పునాదులు తవ్వి వదిలేసిన వాటికి ఇప్పట్లో బిల్లులు మంజూరు చేయకుండా పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంది. పునాది దశ దాటి ప్రగతిలో ఉన్న నిర్మాణాలకు బిల్లులు ఆగవు.

శ్రీనివాసరావు, పీడీ, గృహ నిర్మాణ సంస్థ, విజయనగరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని