logo

దీవిస్తానని... దివాలా తీయించావ్‌..!!

తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారి మేనమామగా నేను అండగా ఉంటా.. కళాశాల, కోర్సుతో సంబంధం లేకుండా విద్యా, వసతి దీవెన అందిస్తా.. మీరు చదువుకోండి..

Published : 09 May 2024 03:52 IST

ప్రైవేట్‌ కళాశాలల పీజీ విద్యార్థులకు అందని విద్యా, వసతి దీవెన
ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వైనం
విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే

తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారి మేనమామగా నేను అండగా ఉంటా.. కళాశాల, కోర్సుతో సంబంధం లేకుండా విద్యా, వసతి దీవెన అందిస్తా.. మీరు చదువుకోండి.. ఉన్నత శిఖరాలు చేరుకోండి.. సీఎం జగన్‌ వేదిక ఎక్కితే విద్యార్థులను ఉద్దేశించి చెప్పే  మాటలివి.. క్షేత్రస్థాయిలో పరిస్థితి విభిన్నంగా ఉంది.


రూ.కోట్లలో బకాయిలు

ఉమ్మడి జిల్లాలో సుమారు 20కుపైగా ప్రైవేటు పీజీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కళాశాలకు సుమారు మూడు నుంచి ఐదు కోర్సులు ఉంటాయి. ప్రతి కోర్సూ రెండేళ్లు ఉంటుంది. కోర్సుకు 40 సీట్లు వరకు ఉంటే.. అందులో పేమెంట్‌ సీట్లు 5-8 వరకు మినహా మిగిలిన వాటిలో ఆయా విద్యార్థులుంటారు. కోర్సుకు సుమారు 30 నుంచి 35 మంది ఉన్నా.. మొత్తం ఏడాదికి ఉమ్మడి జిల్లాలో సుమారు 2,356 మంది వరకు ప్రైవేటులో పీజీలు రెగ్యులర్‌గా చేస్తున్న వారు ఉంటారు. ఈ మేరకు వసతి దీవెన కింద రెండు విడతల్లో రూ.20 వేల చొప్పున మొత్తం ఏడాదిలో 2,356 మందికి రూ.4.71 కోట్లు వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. విద్యా దీవెన ఏడాదికి రూ.5 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఏడాదికి రూ.9.71 కోట్ల వరకు వైకాపా సర్కార్‌ బకాయి ఉంది. గత నాలుగేళ్లుగా ఇప్పటి వరకు సుమారు రూ.40 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది.


దీవెనలోనూ మెలిక

తెదేపా హయాంలో డిప్లమో, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తిపరమైన కోర్సులు చేస్తున్న వారికి వంద శాతం కోర్సుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనం ఇచ్చేవారు. కళాశాలతో సంబంధం లేకుండా అందరు విద్యార్థులకు పథకం వర్తింపు చేసేవారు. విద్యార్థి ముందు కోర్సుకు రుసుం చెల్లిస్తే తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే కళాశాల యాజమాన్యం విద్యార్థులకు చెక్కు రూపంలో తిరిగి ఇచ్చేవారు. దీంతో పాటు ఏడాదికి ఉపకార వేతనాలు కూడా ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి విద్యా దీవెన, వసతి దీవెన అని పేరు పెట్టారు. ప్రభుత్వపరంగా గుర్తింపు పొందిన (విశ్వవిద్యాలయం) ప్రైవేట్‌ పీజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు దీవెనలకు అర్హులు కాదని తేల్చింది. దీనిపై ఆయా సంఘాలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో చాలా మంది అప్పులు చేసి చదువుకుంటున్నారు.

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న పీజీ విద్యార్థులు

2019లో ఉమ్మడి జిల్లాలో పీజీలో ప్రభుత్వ, ప్రైవేటు ఏ కళాశాల అయినా విద్యార్థికి 75 శాతం హాజరు ఉంటే దీవెన పథకాలను వర్తింపు చేశారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం కేవలం ప్రభుత్వ పీజీ కళాశాలలో చదువుతున్న వారికే ఇస్తామని మాట మార్చింది. దీంతో ప్రైవేటు కళాశాలలో చదువుతున్న వారికి రెండు పథకాలు దూరం అయ్యాయి. విద్యా దీవెన కింద కళాశాలలో తీసుకున్న కోర్సు ఆధారంగా ప్రభుత్వం తయారు చేసిన కోర్సు ఫీజుకు (పూర్తి రుసుం చెల్లింపు), అలాగే మెస్‌ఛార్జీల కింద ఏడాదికి విద్యార్థికి రూ.20 వేలు ఇవ్వాల్సి ఉంది. దీన్ని ఏడాదికి రెండు విడతల్లో, కళాశాల ఫీజును నాలుగు విడతల్లో ఇవ్వాల్సి ఉంది.


హాల్‌ టికెట్‌ ఇవ్వకుండా తిప్పలు

వైకాపా ప్రభుత్వం తీరు చూసిన తర్వాత ఆయా కళాశాలల యాజమాన్యం పీజీ విద్యార్థుల నుంచి కళాశాల బిల్డింగ్‌ ఫండ్‌తో పాటు ఇతర రుసుములు కూడా ముందే వసూలు చేస్తోంది. ఏడాదికి రెండు సెమిస్టర్లు ఉంటే ఆయా సెమిస్టర్లకు, ప్రాక్టికల్‌ పరీక్షలకు ఇవ్వాల్సిన హాల్‌ టిక్కెట్లు సమయంలో విద్యార్థులను ఇబ్బందులకు గుర్తిచేసింది. డబ్బులు ఇస్తేనే ఆయా విద్యాపత్రాలు ఇస్తామని తెల్చి చెప్పారు.  దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పలేదు.


అప్పులు చేశా
- రాజేష్‌, సాలూరు

విజయనగరంలోని ఓ వ్రైవేటు కళాశాలలో రెగ్యులర్‌ కోర్సులో 2022లో ఎంఏలో చేరాను. అనంతరం జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో వసతి దీవెన కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో అప్పు చేసి ఫీజులు, ఇతర వాటికి చెల్లించుకున్నా. అధికారులను ఎన్నిమార్లు కలిసినా.. దరఖాస్తు చేసుకోండి, ప్రభుత్వం విడుదల చేస్తే వస్తుందని చెబుతున్నారు.


ఎన్నోసార్లు విన్నవించాం
- ఓ ప్రైవేటు పీజీ కళాశాల విద్యార్థి సంఘ నాయకుడి ఆవేదన

జిల్లాలో ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న పీజీ విద్యార్థులంతా కలిసి కలెక్టర్‌, ఇతర సంక్షేమాధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. దీవెన సొమ్ము ఇవ్వాలని కోరాం. ఎన్నిసార్లు విన్నవించినా ఒక్కసారీ స్పందన లేదు. ఈ ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే మా సీనియర్లకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇలా అయితే ఎలా చదువులు సాగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని