logo

కాలకూట విషం

నకిలీ మద్యం మందుబాబుల పాలిట కాలకూట విషంగా మారింది.. ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్న మద్యానికి చాలామంది బానిసలైపోయారు. మత్తులో మునుగుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Published : 09 May 2024 04:12 IST

ప్రజల గొంతులో నకిలీ మద్యం
గ్రామాల్లో విచ్చల విడిగా అమ్మకాలు
ఎన్నికల వేళ మళ్లీ ఇళ్లకు
-ఈనాడు, విజయనగరం - న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్తా విభాగం/గ్రామీణం, పార్వతీపురం పట్టణం, భోగాపురం, రామభద్రపురం, కొమరాడ, జియ్యమ్మవలస, సాలూరు/గ్రామీణం

నకిలీ మద్యం మందుబాబుల పాలిట కాలకూట విషంగా మారింది.. ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్న మద్యానికి చాలామంది బానిసలైపోయారు. మత్తులో మునుగుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో వందలాది మంది మహిళల పుస్తెలు తెగాయి. కుటుంబ కలహాలకు ఈ మద్యమే కారణమైంది.. ప్రమాదాలు.. గొడవలు.. ఘర్షణలను పెంచింది. వేలమందిని ఆసుపత్రుల పాల్జేసింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నకిలీ మకిలి మరోమారు మీ ఇంటి తలుపు తడుతోంది.. ప్రజలారా తస్మాత్‌ జాగ్రత్త..


సాలూరు పురపాలికకు చెందిన ప్రసాద్‌ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసైన ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో గతేడాది నవంబరు 18న  మరణించారు. అతని భార్య, కుమార్తె, కుమారులు పెద్దదిక్కును కోల్పోయారు. భర్త మృతితో జీవనాధారం కోల్పోయిన ఆమె కూలి పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఆ వచ్చిన కొంత సొమ్ముతోనే పిల్లల కడుపు నింపుతున్నారు. తన భర్త మృతి తరువాత మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీచేయక పోవడంతో వితంతు పింఛను రావడం లేదని వాపోయారు.

న్యూస్‌టుడే, సాలూరు


మ్మడి జిల్లాలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఎప్పుడూ లేని కొత్త బ్రాండ్లు మార్కెట్‌లోకి రావడంతో మద్యం ప్రియులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు ధరలు సైతం పెరగడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు రూ.60కి దొరికే సీసా నేడు రూ.150 వరకు చేరింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 202 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ విజయనగరం సమీపంలోని నెల్లిమర్ల దగ్గరున్న గోదాము నుంచి సరకు సరఫరా అవుతోంది. లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా చాలాచోట్ల అమలు కావడం లేదని తెలుస్తోంది. ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లింపులు నిలిచినట్లు సమాచారం.


కాళ్లు, చేతులు పడిపోయాయి..

భోగాపురం మండలం జగ్గయ్యపేటకు చెందిన రమణ మూడేళ్ల క్రితం వరకు ఆరోగ్యంగా ఉండేవారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు మందలించినా వినకుండా బానిసవడంతో కొన్ని రోజుల క్రితం కాళ్లు, చేతులు పడిపోయాయి. రూ.లక్షలు వెచ్చించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. పిల్లలు చూస్తే చిన్నవారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

న్యూస్‌టుడే, భోగాపురం


మంచం పట్టి

సాలూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి కుటుంబాన్ని పెంచి పోషించేవారు. నాసిరకం మద్యం తాగడంతో ఆరోగ్యం పాడైంది. పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. దీంతో ఉద్యోగం కూడా పోయి జీవనాధారం కోల్పోయి, మంచం పట్టారు. భార్య మృతి చెందింది. ఇద్దరు కుమారులు బయట పనులు చేస్తూ అతనికి సేవలు చేస్తున్నారు.


ఆసుపత్రుల్లో వారే ఎక్కువ..

విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోజుకు సుమారు 700 నుంచి 1000 వరకూ ఓపీ నమోదవుతుంది. ఇందులో మందు తాగడం వల్ల ఇబ్బందిగా ఉందని ఆసుపత్రికి వచ్చేవారి ఓపీ 30 నుంచి 40 వరకు ఉంటోందని వైద్యులు పేర్కొంటున్నారు. మిగిలిన ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 200లకు పైగానే ఉంటోంది. వారిలో ఎక్కువ మంది కిడ్నీలు, కాలేయం పాడైనవారు ఉంటున్నారని, పచ్చకామెర్లు, గుండెల్లో సమస్య, ఆందోళన, నిద్రలేమి, మానసిక ఒత్తిడితో చాలామంది బాధపడుతున్నారని ఒక జనరల్‌ ఫిజీషియన్‌ వెల్లడించారు.


మహిళల ఆందోళన..

అమ్మకాలకు వ్యతిరేకంగా సమావేశమైన మెట్టవలస వాసులు(పాతచిత్రం)

తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని మొదటి నుంచీ మహిళలు ఉద్యమిస్తున్నారు.

  • ఇటీవల పాలకొండ మండలం గోపాలపురంలో మద్యం దుకాణం వద్దంటూ ఆ గ్రామ మహిళలు సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు.
  • సాలూరు మండలం తోణాం పంచాయతీ మెట్టవలసలో మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. లిక్కర్‌తో పాటు సారా తాగకూడదని, తాగిన వారు గ్రామంలోకి రాకూడదని తీర్మానించారు.
  • విజయనగరం, కొత్తవలస, ఎస్‌.కోటలోనూ ఆందోళనలు జరిగాయి.

అనారోగ్యం ముప్పు

  • పార్వతీపురంలోని బెలగాం రైల్వే స్టేషన్‌ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి మద్యం తాగి రెండేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఇతను ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. భార్య, ముగ్గురు కుమారులున్నారు.
  • పార్వతీపురంలోని బొగ్గుల వీధికి చెందిన ఓ వ్యక్తి ఏడాది క్రితం కన్నుమూశారు. ఇతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అతని భార్యకు పింఛను కూడా రావడం లేదు.
  • పార్వతీపురం మండలం కృష్ణపల్లికి చెందిన 37 ఏళ్ల యువకుడు నాలుగు నెలల క్రితం కిడ్నీల వ్యాధితో మృతి చెందాడు. అధికంగా మద్యం తాగడమే కారణమని వైద్యులు తేల్చిచెప్పారు.

నా భర్త చనిపోయాడు..

కల్తీ మద్యం తాగి నా భర్త చనిపోయాడు. గతంలో కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతను మరణించాక ఏం చేయాలో తెలియక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని బతుకీడుస్తున్నా. వచ్చే కొంత నగదుతోనే కుమార్తెను చదివించుకుంటున్నా.

బాధితురాలు, రామభద్రపురం


విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో గత మూడు, నాలుగేళ్లలో 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసుగల వారు 40 మంది  వరకు మరణించారు. 41 ఏళ్లకు మించిన వారు 50 మందికి పైగానే ఉన్నారు. మద్యంతో పాటు గంజాయి, నాటుసారా కలిపి తీసుకోవడంతో ఇటీవల ఎక్కడికక్కడే మృతుల సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగి చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతుండడం గమనార్హం.


వందల సంఖ్యలో మరణాలు..

విజయనగరంలోని దేవాలయం, రవాణా శాఖ కార్యాలయానికి ఆనుకొని ఏర్పాటైన మద్యం దుకాణం

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడు, నాలుగేళ్లలో ఎంతోమంది మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోయారు.. మత్తు ఎక్కువై కుటుంబాలకు దూరమయ్యారు.. ఈక్రమంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ః కొమరాడ మండలం మాదలింగి, భోగాపురం మండలంలోని రామచంద్రంపేట గ్రామానికి చెందిన కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ః భర్తకు మందు అలవాటు ఉండడం, మత్తులో వింతగా వ్యవహరిస్తుండడడంతో భోగాపురం మండలానికి చెందిన ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. ః జియ్యమ్మవలస మండలానికి చెందిన ఓ వృద్ధుడు మత్తులో తన భార్యను అనుమానించేవాడు. చివరకు ప్రాణాలు సైతం తీసేశాడు. ః మద్యం తాగొద్దు.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కుటుంబ సభ్యులు మందలించారని నగరంలోని అంబటి సత్రం సమీపంలో ఒకరు, బొగ్గులదిబ్బ సమీపంలో మరొకరు, వైఎస్‌ఆర్‌ నగర్‌, కాటవీధి, అశోక్‌ నగర్‌, పూల్‌బాగ్‌ ప్రాంతాల్లో నలుగురు ఉరేసుకున్నారు.


మద్యం కారణంగా రెండు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు ఇలా..(శాతాల్లో)

కాలేయ సమస్యలు: 15
నిద్ర లేమి : 18
లైంగిక సమస్యలు: 15
ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు: 12
మూత్రపిండాలు పాడవడం: 20
నరాల బలహీనత: 20


ఈ ఐదేళ్లలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రూ.6,876 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది


మాయదారి మద్యాన్ని మానేందుకు సర్వజనలోని మత్తు వ్యసనపరుల విముక్తి చికిత్స కేంద్రానికి వచ్చినవారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని