logo

నేరడి.. హామీల గారడీ

ప్రతి ఎకరాకు సాగు నీరందస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక  వ్యవసాయ రంగాన్ని దగా చేశారు. అయిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిస్సారంగా మార్చారు.

Published : 09 May 2024 04:23 IST

మిగిలిన మంత్రుల హడావుడి
మూడేళ్లయినా పడని పునాది రాయి
న్యూస్‌టుడే, భామిని

నేరడి బ్యారేజీ నిర్మించతలపెట్టిన స్థలం

ప్రతి ఎకరాకు సాగు నీరందస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక  వ్యవసాయ రంగాన్ని దగా చేశారు. అయిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిస్సారంగా మార్చారు. వేల ఎకరాల్లో పంటలు పండించే రైతులను వర్షాధారంపైనే ఆధారపడే దుస్థితి కల్పించారు. జిల్లాలోని భామినిలో నేరడి బ్యారేజీ నిర్మాణం ఆ కోవలోకే వస్తుంది.

భామిని మండలంలోని నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి వంశధార నది నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న సుమారు 115 టీఎంసీల నీటిని ఒడిసి పట్టాలని భావించారు. వంశధార నది నుంచి హిర మండలంలోని రిజర్వాయర్‌కు మళ్లించి పొలాలకు నీరివ్వాలని నిర్ణయించారు. కానీ బ్యారేజీ నిర్మాణానికి ఎప్పటికప్పుడు అడ్డంకులు రావడంతో అడుగులు ముందుకు పడటం లేదు. దీంతో ఆ పరిధిలోని రైతులు నిరాశకు గురవుతున్నారు.


ట్రైబ్యునల్‌ అనుమతులు..

ముకుంద శర్మ నేతృత్వంలో ట్రైబ్యునల్‌ కమిటీ సభ్యులు గతంలో వంశధార నది ప్రాంతంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి తీర్పు ఇచ్చారు. ఒడిశా ప్రభుత్వంపై ఆర్థికభారం లేకుండా చూశారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.1700 కోట్లు వెచ్చించి హిర మండలంలో ఫేజ్‌-2, స్టేజ్‌-2లో దాదాపు 90 శాతం రిజర్వాయర్‌ పనులు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం కాట్రగడ వద్దనున్న సైడ్‌ వీఆర్‌ ద్వారా రిజర్వాయర్‌లోకి 8 టీఎంసీల నీరు మళ్లిస్తున్నారు. కేవలం ఖరీఫ్‌ పంటకు మాత్రమే అందిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం అంగీకారంతో నేరడి వద్ద బ్యారేజీ నిర్మిస్తే సముద్రంలో కలుస్తున్న వందల టీఎంసీల నీటిని ఒడిసి పట్టొచ్చని జల వనరుల శాఖ నిపుణులు చెబుతున్నారు.  


మంత్రులు పర్యటించినా..

2021లో హడావుడిగా స్థల పరిశీలనకు వచ్చిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు

నేరడిలో బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్‌ తీర్పు రావడంతో జలవనరులు శాఖ ద్వారా ప్రభుత్వం హుటాహుటిన డీపీఆర్‌లు సిద్ధం చేసింది. 2021లో అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజులు బ్యారేజీ నిర్మించాల్సిన ప్రాంతం, హిరమండలం వద్ద రిజర్వాయర్‌, వరద కాలువను పరిశీలించారు. అనంతరం రూ.647 కోట్లతో ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నివేదికను ఒడిశా ముఖ్యమంత్రికి ఇస్తామని వారు తెలిపారు. మంత్రుల పర్యటన సమయంలో ఒడిశాకు చెందిన సరా, బడిగాంలో సేకరించాల్సిన 106 ఎకరాల విస్తీర్ణానికి పరిహారంతో పాటు సమస్యలను పరిష్కరించి బ్యారేజీ నిర్మించాలని ఆ రాష్ట్రం కోరింది. మరోవైపు ట్రైబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఒడిశా నాయకులు కొత్త మెలిక పెట్టారు. దీంతో పనులు మళ్లీ మొదటికి వచ్చాయి.  


ముఖ్యమంత్రి కలిసినా ఒరిగింది లేదు..  

బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాతో జలవివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌, జల వనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌, అధికారులతో చర్చలు జరిపారు. కానీ ఇవి ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వైకాపా సృష్టించిన హడావుడి అంతా ఆర్భాటానికే పరిమితమైంది.


ఎన్నో అడ్డంకులు..

  • 1956 జులైలో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 1961 ఫిబ్రవరి 11న నేరడి బ్యారేజీ పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణకు ఒడిశా అడ్డంకులు సృష్టించడంతో పనులు నిలిపేశారు. 1961 జులైలో  ఒడిశా 106 ఎకరాలు అప్పగించడంతో నిర్మాణానికి అంగీకారం కుదిరింది. కానీ పనులు చేయలేదు. తర్వాత ఒడిశా మరోసారి అడ్డంకులు సృష్టించింది.  
  • దీనికి ప్రత్యామ్నాయంగా 1977లో గొట్టా బ్యారేజీ నిర్మించారు.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో 2005లో మరోసారి నేరడి వద్ద బ్యారేజీ పనులు ప్రారంభం కాగా ఒడిశా ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. 2014లో తెదేపా హయాంలో మరోసారి ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. యువతకు ప్యాకేజీ, వివిధ సమస్యలు పరిష్కరించి హిరమండలంలో రిజర్వాయర్‌ పనులను దాదాపు పూర్తి చేశారు.19 గ్రామాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పించారు. న్యాయస్థానానికి నివేదికలు అందించారు. కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించిన మేరకు వంశధారలో లభిస్తున్న 115 టీఎంసీల నీటిని ఉభయ రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని న్యాయస్థానం పేర్కొంది. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణ వ్యయం ఆంధ్రా ప్రభుత్వం భరించాలని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని