logo

చిన్నారుల సృజనకు సంకెళ్లు

గ్రంథాలయాలు..విజ్ఞాన వీచికలు. చిన్ననాటి నుంచి పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాలంటే ఇవే వేదికలు. దీంతో వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం సద్వినియోగం చేసేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తోంది.

Published : 23 May 2024 02:37 IST

విజ్ఞాన శిబిరాలకు కొన్నిచోట్ల మంగళం
జిల్లాలో గ్రంథ పాలకుల కొరత 

గ్రంథాలయాలు..విజ్ఞాన వీచికలు. చిన్ననాటి నుంచి పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాలంటే ఇవే వేదికలు. దీంతో వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం సద్వినియోగం చేసేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తోంది. చిన్నారులను ఆకట్టుకునేలా వివిధ అంశాలపై 24 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇవి ఈ నెల 15న ప్రారంభమై జూన్‌ 7వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. అంత వరకూ బాగానే ఉన్నా గ్రంథ పాలకుల కొరతతో ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల దరి చేరకపోవడం ఆవేదన కలిగిస్తోంది.

హనుమంతునిపాడులో విద్యార్థుల నృత్య సాధన   

పామూరు, న్యూస్‌టుడే: జిల్లాలో 66 గ్రంథాలయాలు ఉండగా అందులో 28 చోట్ల గ్రంథపాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని పామూరు, పీసీపల్లి, కనిగిరి,  మర్రిపూడి, కురిచేడు, ముండ్లమూరు, దర్శి తదితర చోట్ల గ్రంథపాలకులు లేరు. దీంతో జిల్లాలోని 28 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు జరగడంలేదు. ప్రస్తుతం హనుమంతునిపాడు, సీఎస్‌.పురం, కొండపి, జరుగుమల్లి, టంగుటూరు, దర్శి, దొనకొండ తదితర చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. 

ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయక..

ఏళ్ల తరబడి గ్రంథపాలకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఒక్కొక్కరు రెండు, మూడేసి చోట్ల విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ఒక్కో గ్రంథాలయం వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన రోజుల్లో మూతపడి ఉంటున్నాయి. వేసవిలో విద్యార్థులు ఎండకు బయట తిరగకుండా ఉండేందుకు, పిల్లల్లో పుస్తక పఠనాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తోంది. జిల్లాలో దాదాపు సగంచోట్ల వీటి నిర్వహణ లేకపోవడంతో అక్కడ విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

కార్యాచరణ ఇలా..

  • గ్రంథాలయంలో జూన్‌ 7వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి విజ్ఞాన శిబిరం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు ఉంటుంది. 10 నుంచి 15 ఏళ్ల వయస్సున్న 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు హాజరుకావచ్చు. ప్రాథమిక స్థాయిలో చదువుతున్న చిన్నారులను తల్లిదండ్రులు విజ్ఞాన శిబిరానికి పంపొచ్చు. 
  • కథలు చదివి వినిపించడం, వినగలిగే సామర్థ్యాన్ని పెంపొందించడం, పుస్తకాలు చదవడం, పుస్తక సమీక్ష, కథలు చెప్పడం, స్పోకెన్‌ ఇంగ్లిష్, పెయింటింగ్, డ్రాయింగ్,  పేపర్‌ క్రాప్టు, సంగీతం, నృత్యం, అతిథుల ప్రసంగాలు, బొమ్మలు తయారు చేయడం, క్యారమ్స్‌ తదితర అంశాలపై తర్ఫీదునివ్వడం, అవగాహన కల్పించడం చేస్తారు. 
  • తల్లిదండ్రుల అనుమతితో దూరప్రాంతాల నుంచి వచ్చిన బాలలను కూడా చేర్చుకుంటారు. వారు నిత్యం శిక్షణకు హాజరయ్యేలా చూడాలని గ్రంథాలయ నిర్వాహకులను నిర్దేశించారు. 

తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలకు పంపించాలి. ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, యువత చొరవ చూపాలి. విద్యార్థులు వేసవిలో బయట తిరగకుండా సెలవులను వృథా చేసుకోకూడదు. విద్యార్థులకు పఠనాసక్తి, సృజనాత్మకత పెంపొందుతుంది. జిల్లాలో గ్రంథపాలకులు ఉన్న 38 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. గ్రంథపాలకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. 

-కాసు ఆదిలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు