logo

పేదల ఆరోగ్యంతో చెలగాటం

పేదల ప్రభుత్వమంటూ పదే పదే చెబుతూ వచ్చిన వైకాపా సర్కారు వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అందించిన సేవలకు గాను ఆసుపత్రులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో తరచూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.

Updated : 23 May 2024 04:45 IST

పూర్తిస్థాయిలో బిల్లులివ్వని సర్కారు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పేదల ప్రభుత్వమంటూ పదే పదే చెబుతూ వచ్చిన వైకాపా సర్కారు వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. అందించిన సేవలకు గాను ఆసుపత్రులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో తరచూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తాజాగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో యాజమాన్యాలు సేవలు అందించలేమని మంగళవారం చేతులెత్తేశాయి. అదేరోజు సాయంత్రానికి స్పందించిన ఉన్నతాధికారులు బకాయిల్లో కొంత విడుదల చేశారు. రూ.కోటి ఇవ్వాల్సిన వారికి రూ.10 లక్షలిచ్చారు. ఆ విధంగా గత రెండేళ్లలో ఇప్పటి వరకు రెండు విడతలు నామమాత్రంగా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం మూడో విడత కావడం గమనార్హం. ఈ తీరుపై ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.

జిల్లాకు ఇవ్వాల్సింది రూ.50 కోట్లు...

జిల్లాలో 127 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులున్నాయి. వీటన్నింటికి గడిచిన ఆగస్టు నుంచి బకాయిలు రావాల్సి ఉంది. రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొవిడ్‌ సమయంలో బిల్లులు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. ఒంగోలులోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికైతే ఏకంగా రూ.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీము కింద రూ.5 కోట్లు రావాల్సి ఉంది. జిల్లాలో 9,53,701 మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులుండగా, 66,351 మంది ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం ఉన్న ఉద్యోగులు, పింఛనుదారులున్నారు. వీరందరికీ ఓపి నుంచి మందులు వరకు నగదు రహిత వైద్యం అందించాల్సిందే. ఆసుపత్రులకు బిల్లులు సక్రమంగా రాకపోవడంతో సాధ్యమైనంత వరకు ఏదో సాకు చెప్పి వెనక్కి పంపుతున్నారు. ఎవరైనా సొంత డబ్బులు పెట్టుకుంటామని ముందుకొస్తే సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి సేవలు కొనసాగిస్తూ.. కొత్తవారికి అవకాశం లేదని కొన్నిచోట్ల వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని