logo

నల్లగొండపై అధికారం కళ్లు..!

విలువైన బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలున్నాయనే సమాచారంతో అటవీ భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఎలాగైనా దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో తాళ్లూరు మండలంలో 125 ఎకరాలు కొట్టేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు

Published : 30 Jun 2022 02:02 IST

125 ఎకరాల అటవీ భూములకు దరఖాస్తులు ‌

 నిరభ్యంతర పత్రాలకు అధికారులపై ఒత్తిడి

అధికారపార్టీ నాయకులు దక్కించుకోవాలని చూస్తున్న నల్లకొండ ఇదే

విలువైన బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలున్నాయనే సమాచారంతో అటవీ భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఎలాగైనా దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో తాళ్లూరు మండలంలో 125 ఎకరాలు కొట్టేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికారుల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలు వస్తే తర్వాత గనులు, జాతీయ హరిత బోర్డు (ఎన్జీటీ) అనుమతులు తెచ్చుకుని యథేచ్ఛగా తవ్వేసుకోవచ్చని తహతహలాడుతున్నారు. ఇందుకు అన్నివైపుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాళ్లూరు మండలంలోని శివరాంపురం, నాగంబొట్లపాలెం, సోమవరప్పాడు గ్రామాల పరిధిలో దాదాపు 1800 ఎకరాల అటవీ భూములున్నాయి. ఇందులో శివరాంపురం పంచాయతీ గుంటిగంగ వద్ద సర్వే నెంబరు 290లో నల్లకొండ ప్రాంతం 125 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి సమీపంలోని సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబరు 367లో దొడ్డికొండలో కూడా గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని గతంలో గుర్తించారు. ఇక్కడ తవ్వకాలకు 15 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్‌ సంస్థ అనుమతులు పొందడంపై అనేక విమర్శలు వచ్చాయి. అటవీ భూమిలో కొంతభాగాన్ని రెవెన్యూగా చూపించి అనుమతులు పొందారని, ఆ కొండకు దక్షిణం వైపునున్న ఏకలవ్యనగర్‌ తండాకు వెళ్లే రహదారిని ఆక్రమించి తవ్వకాలు సాగించేందుకు చూస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు చోట్ల తవ్వకాలు ప్రారంభించిన సదరు సంస్థ అనంతరం క్వారీయింగ్‌ నిలిపేసింది.

ఇనుప ధాతు ఖనిజాలున్నాయని..
దొడ్డికొండకు సమీపంలో ఉన్న నల్లకొండపై ఇప్పుడు కొందరి కళ్లు పడ్డాయి. నల్లకొండలో ఇనుప ధాతు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని భావించి పలు దఫాలుగా సర్వే కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏకంగా హెలీకాప్టర్‌లో వచ్చి కొండ పైనుంచి గతంలో పరిశీలించారు. రాష్ట్ర నాయకులు, ఉన్నతాధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. అటవీ భూములు కావడంతో అనుమతులు లభించకపోవడం, అదే సమయంలో దొడ్డికొండ అనుభవం కారణంగా ఈ కొండను వదిలేసినట్లు తెలిసింది.

అనుమతులకు అడ్డదారులు తొక్కుతూ...
నల్లకొండ భూములను ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ నాయకులు ఇప్పుడు రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో ఆరుగురు దరఖాస్తులు చేశారు. ఒక్కొక్కరు 4 హెక్టార్ల నుంచి 10 వరకు.. మొత్తం 125 ఎకరాలకు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అనుమతి కావాలంటూ పత్రాలు అందజేశారు. కొండ మొత్తం అటవీ శాఖ పరిధిలో ఉండటంతో అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. దీనికి గతంలో ఓ ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన జీవోను ఆధారంగా చేసుకుని ఒక ఎకరం అటవీ భూమికి గాను వేరే చోట మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని అటవీ శాఖ అధికారులను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరభ్యంతర పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ కార్యాలయం అధికారులపై రాజకీయంగా, గనుల శాఖ నుంచి ఒత్తిడి చేయిస్తున్నారు. అదే సమయంలో ఎన్జీటీ నుంచి కూడా అనుమతులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఆ కొండ అటవీ శాఖ పరిధిలో ఉందని, అడ్డగోలు ఒప్పందాలకు ఒప్పుకొని ఉద్యోగాలు పోగొట్టుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఓ అటవీ శాఖ ఉద్యోగి అభిప్రాయపడ్డారు.

భూముల పరిశీలనతో ఆందోళన...
నల్లకొండ ప్రాంతంలో ఇటీవల కొందరు అధికారులు పర్యటించి పరిశీలించారు. దీంతో అక్కడి సువిశాలమైన అటవీ, ప్రభుత్వ భూముల్లో పశువులు, గొర్రెలు మేపుకొనే తాళ్లూరు, మాధవరం, తూర్పుగంగవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో మూగజీవాలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నామని.. ఇక్కడ క్వారీయింగ్‌ చేస్తే వాటికి మేత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండను అనుకునే రూ.8 కోట్లతో నిర్మించ తలపెట్టిన మొగిలిగుండాల జలాశయం నిర్మాణంపై కూడా క్వారీయింగ్‌ ప్రభావం పడుతుందని, దీంతో ప్రాజెక్టు దిగువన 1500 ఎకరాలకు నీళ్లు అందకుండా పోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని