logo

ఇంపాక్ట్‌ భారం రూ.20 కోట్లు

రహదారి పక్కన స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవాలంటే ఫీజుల రూపంలో అదనపు భారం మోయాల్సిందే. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి విభాగాల ద్వారా కొత్తగా ఇంపాక్ట్‌ ఫీజు వసూలుకు నిర్ణయించారు.

Published : 14 Aug 2022 02:12 IST

రహదారుల పక్కన ఇల్లు కట్టేవారిలో ఆందోళన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే

రహదారి పక్కన స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవాలంటే ఫీజుల రూపంలో అదనపు భారం మోయాల్సిందే. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి విభాగాల ద్వారా కొత్తగా ఇంపాక్ట్‌ ఫీజు వసూలుకు నిర్ణయించారు. జీవో జారీ కావడంతో ఇకపై భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నవారు బిల్డింగ్‌ లైసెన్స్‌ ఫీజుతోపాటు దీనినీ కట్టక తప్పదు. ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఒడా) పరిధిలో మార్కాపురం, కనిగిరి, చీరాల మున్సిపాలిటీలతో పాటు గిద్దలూరు, పొదిలి, దర్శి, చీమకుర్తి, అద్దంకి, కందుకూరు నగర పంచాయతీలు, ఒంగోలు కార్పొరేషన్‌ ఉన్నాయి. వీటిలో 60 చదరపు అడుగుల పైన వెడల్పు కలగిన రహదారుల పక్కన స్థలాల్లో ఇళ్లు నిర్మించే వారికి ఇంపాక్ట్‌ పడుతుంది.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మ్యాపింగ్‌ చేపట్టారు. ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేయబోతున్నారు.

ఒంగోలులో 20.. ఒంగోలులో ఇంపాక్ట్‌ ఫీజు పరిధిలోకి వచ్చే రహదారులు 20 ఉన్నట్లు గుర్తించారు. మంగమూరురోడ్డు, 60 అడుగుల రోడ్డు, కొత్తపట్నం రోడ్డు, త్రోవగుంట, ముక్తినూతలపాడు, చెరువుకొమ్ముపాలెం రహదారులు.. రాంనగర్‌, ఆనందరావురోడ్డు, రైల్వేస్టేషన్‌ రోడ్డు, ఏబీఎం కళాశాలరోడ్డు, కర్నూలురోడ్డు, గుంటూరు రోడ్డు వంటివి ఉన్నాయి. వీటి పక్కన భవన నిర్మాణాలకు ప్లాన్‌ కోరితే ఇంపాక్ట్‌ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ నగరంలో ప్రస్తుతం 64 వేల అసెస్‌మెంట్లు(ఇళ్లు) ఉండగా ఏటా కొత్తగా 5 శాతం పెరుగుతున్నాయి. ఏడాదికి పట్టణ ప్రణాళిక విభాగంలో 250 వరకు ప్లాన్‌లు తీసుకుంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 20 రహదారుల వెంట జరిగే నిర్మాణాలు 20 నుంచి 30 శాతం ఉంటాయని అంచనా. ఇతర పట్టణాల్లో జరిగే కట్టడాల్లో ఇంపాక్ట్‌ పరిధిలోకి వచ్చేవి 40శాతం ఉంటాయి.. మొత్తం మీద ఏడాదికి రూ.20 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది.

వసూలు ఇలా: రహదారి పక్కన ఉన్న స్థలాల రిజస్ట్రేషన్‌ విలువలో మూడుశాతం ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాలి. చదరపు అడుగుకు రూ.100 లేదా చదరపు మీటర్‌కు రూ.1076 చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే 100 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, బిల్డింగ్‌ లైసెన్స్‌ ఫీజు, లేబర్‌ సెస్సు, ఖాళీస్థలం పన్ను ఇలా 14 రకాల ఫీజులు సుమారు రూ.20 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇంపాక్ట్‌ కూడా దాదాపు రూ.20వేలు కట్టాల్సి వస్తుందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని