logo

యుద్ధానికి నేనూ సిద్ధం

వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు.

Updated : 29 Mar 2024 04:53 IST

వైకాపాను వీడనున్న పెద్దిరెడ్డి
త్వరలో తెదేపాలోకి చేరిక!

సూర్యప్రకాష్‌రెడ్డి

ఒంగోలు, న్యూస్‌టుడే: వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. ప్రైవేట్‌ సైన్యంతో బెదిరింపులకు దిగుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని హరిస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత సస్పెన్షన్‌కు గురైనప్పటికీ వెనక్కి తగ్గలేదు. సార్వత్రిక ఎన్నికల తరుణం తరుముకొచ్చిన సమయంలో ఇప్పుడు అధికార పార్టీని వీడి అక్రమార్కులపై యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఇప్పుడీ వ్యవహారం వైకాపాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భూఆక్రమణలు, ఆగడాలపై పోరు...: ఒంగోలు వాసి అయినప్పటికీ మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం వైకాపా నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి ఉద్యమించారు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆమరణ దీక్ష చేశారు. అనంతరం అక్కడే కార్యాలయం ఏర్పాటుచేసుకుని మార్కాపురం కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు చేపట్టారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల తీరుపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించారు. అక్కడి ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌రెడ్డి అవినీతి అక్రమాలు, భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా అధిష్ఠానానికే ఆధారాలతో ఫిర్యాదు చేశారు. భూ మాఫియాను నడుపుతూ కృష్ణమోహన్‌రెడ్డిని నయా నయీంగా సంబోధించి కలకలం రేపారు. భూ అక్రమణలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రోత్సాహం కూడా ఉందంటూ బాంబు పేల్చారు. భూములు కోల్పోయిన బాధితులతో కలిసి అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో వైకాపా అధిష్ఠానం పెద్దిరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి ఇటీవల సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నారు.

పశ్చిమంపై ప్రధాన దృష్టి...: మార్కాపురం టికెట్‌ అశించినప్పటికీ వైకాపా నాయకత్వం పెద్దిరెడ్డికి మొండిచేయి చూపింది. దీంతో ఆయన వైకాపాతో విభేదించి దూరంగా ఉండిపోయారు. గత కొన్నిరోజులుగా జిల్లా తెదేపా నాయకులతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. తాను తెదేపాలో చేరి పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థుల ఓటమికి కృషి చేస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలో మార్కాపురంలో చంద్రబాబు నిర్వహించే ప్రజాగళం సభలో ఆయన పసుపు కండువా కప్పుకొనేందుకు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని