logo

మునగలేం.. వైకాపాతో ఉండలేం

గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చాం. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామంటూ బాసలు చేశాం. తీరా అధికారంలోకి వచ్చాక ఇన్నాళ్లూ చేసిందేమీ లేదు.

Published : 16 Apr 2024 04:06 IST

తేల్చి చెబుతున్న నేతలు, ప్రజాప్రతినిధులు
అధికార పార్టీ నుంచి తెదేపాలోకి చేరికలు

ఈనాడు, ఒంగోలు: గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చాం. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామంటూ బాసలు చేశాం. తీరా అధికారంలోకి వచ్చాక ఇన్నాళ్లూ చేసిందేమీ లేదు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారానికి వెళ్తుంటే ప్రజల్లో వైకాపాపై ఉన్న వ్యతిరేకత తెలుస్తోంది.  అభ్యర్థుల మార్పంటూ అధిష్ఠానం జిమ్మిక్కులు చేసినా జనం నమ్మడం లేదు. సమస్యలపై పలుచోట్ల ముఖం మీదనే నిలదీస్తున్నారు. ఓటమి భయంతో.. ఎలాగైనా గెలవాలని బరితెగిస్తున్నాం. దొడ్డి దారి ప్రయత్నాలు సాగిస్తున్నాం. తాయిలాలు ఎరవేస్తున్నాం. అయినా ప్రజల్లో మనపై పూర్తిస్థాయి విశ్వాసం ఉన్నట్లు కనిపించడం లేదు. పార్టీనే నమ్ముకుంటే మేము కూడా మునిగేలా ఉన్నాం...

ఇవీ ప్రస్తుతం అధికార పార్టీ వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకుల మాటలు. అధికార పార్టీపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను నేతలు, ప్రజాప్రతినిధులు ముందుగానే గుర్తిస్తున్నారు. దీంతో వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు.


  • దర్శి నియోజకవర్గంలో సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు వైకాపా అధిష్ఠానం మొండిచేయి చూపింది. ఆయన సోదరుడు శ్రీధర్‌ ఇటీవల మాగుంట రాఘవ్‌రెడ్డితో చర్చించి తెదేపాలో చేరారు. ఈ నియోజకవర్గంలోని దొనకొండ మండలానికి చెందిన వైకాపా కన్వీనర్‌ నారపురెడ్డి, దొనకొండ జడ్పీటీసీ సభ్యుడు సుధాకర్‌, పోలేపల్లి ఎంపీటీసీ సభ్యుడు జాన్‌మార్కు ఇటీవల తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
  • మార్కాపురంలో వైకాపా అభ్యర్థిగా అన్నా రాంబాబు పోటీలో నిలిచారు. అక్కడ ఆయనకు ఎదురు గాలి తప్పడం లేదు. దీంతో మార్కాపురం ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ డీవీ.కృష్ణారెడ్డి, వైకాపా నాయకుడు ఏరువా రామిరెడ్డి, తర్లుపాడు జడ్పీటీసీ మాజీ సభ్యుడు రావి బాషాపతిరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు వెనుగొండారెడ్డి, ఉప్పలపాడు సర్పంచి ఏసోబు, మాజీ సర్పంచులు సుబ్బారెడ్డి, ఉలవా గోపి, వైకాపా నియోజకవర్గ ప్రచార ప్రధాన కార్యదర్శి మయూరి ఖాసీం తదితరులు ఇటీవల అధికార పార్టీని వీడి కూటమికి జై కొట్టారు.
  • ఒంగోలు నగరంలోని 37వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ చెన్నుపాటి వేణుగోపాల్‌ ఆ పార్టీకి దూరమయ్యారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాసులురెడ్డి, దామచర్ల జనార్దన్‌ సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.
  • గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు ఆ పార్టీ తీరుతో విసిగివేసారారు. నియోజకవర్గ కాపు సంఘం మాజీ అధ్యక్షుడు యల్లా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి శ్రీనివాసులు, అర్థవీడు మాజీ ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, ఉప సర్పంచి, ఇద్దరు వార్డు సభ్యులు, నాయకులు అధికార పార్టీతో అంటకాగలేమని ప్రకటించారు. తెదేపా యువనేత మాగుంట రాఘవ్‌రెడ్డి, గిద్దలూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో పెద్దసంఖ్యలో తెదేపాలో చేరారు.
  • యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైకాపా పుల్లలచెరువు మండల అధ్యక్షుడు బోగోలు సుబ్బారెడ్డి, కవలకుంట్ల మాజీ సర్పంచి తదితరులు ఇటీవల ఆ పార్టీని వీడారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని