logo

నీళ్లో.. జగనన్నా!

గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్‌బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది.

Published : 04 May 2024 06:18 IST

వారానికి 2 డ్రమ్ముల సరఫరా
రూ.50 వంతున ట్యాంకర్ల వద్ద కొనుగోలు

ట్యాంకర్‌ వద్ద నీరు పట్టుకుంటున్న స్థానికులు

గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్‌బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది. నీటి సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం హయాంలో గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఎర్రకుంట వద్ద డీప్‌బోర్లను వేసి పైపులైను ద్వారా నీటిని సరఫరా చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైతం డీప్‌బోర్లలో భూగర్భజలం అడుగంటడంతో 10 డీప్‌బోర్లు ఆడించినా రోజుకు ఒక ప్రాంతానికీ నీరు అందించ లేని పరిస్థితి నెలకొంది.

పంచాయతీలోని పలుప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం నగర పంచాయతీ అధికారులు ప్రజలకు వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా ఇంటికి 2 డ్రమ్ముల నీటిని అంటే కేవలం 400 లీటర్ల నీటిని మాత్రమే అందజేస్తున్నారు.  నగర పంచాయతీ ప్రజలకు సరఫరా చేసే 400 లీటర్ల నీరు వారం రోజులకు సరిపోక ప్రైవేటు ట్యాంకర్ల వద్ద డ్రమ్ము నీటిని రూ.50వంతున కొనుగోలు చేస్తున్నారు. ఈ ట్యాంకర్లు తక్కువగా ఉండటంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. నగర పంచాయతీ అధికారులు రోజుకు కేవలం సుమారు 60 ట్యాంకర్ల ట్రిప్పులను మాత్రమే సరఫరా చేస్తుండటంతో అవి ప్రజల వాడుక నీటి డిమాండ్‌ తగ్గట్టుగా లేకపోవడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు.  ట్యాంకర్ల యజమానులకు గుత్తేదారులు బిల్లులు అందించకపోవడంతో ట్యాంకర్ల యజమానులు నీటిని సరఫరా చేసేందుకు ఆసక్తిచూపడం లేదు. ఫలితంగా గిద్దలూరు నగర పంచాయతీ ప్రజలకు వాడుక నీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

న్యూస్‌టుడే, గిద్దలూరు

మూడురోజులకొసారైనా అందించాలి

నెలరోజులుగా వీధిలోని కుళాయిలకు నీరు సరఫరా కావడం లేదు. అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి మీద ఆధారపడ్డాం.  నీటిని పొదుపుగా వాడుకున్నప్పటికీ మళ్లీ నగరపంచాయతీ ట్యాంకరు వచ్చేంత వరకూ నీరు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల వద్ద నీటిని కోనుగోలు చేయాల్సి వస్తోంది.  ఇప్పటికైనా అధికారులు కనీసం 3 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలి.

నిర్మల, దూదేకులవీధి, గిద్దలూరు

డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నాం

తమ వీధిలో గత నెలరోజులుగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నగర పంచాయతీ అధికారులు వారానికొసారి ఇంటికి 2 డ్రమ్ముల నీటిని అందజేస్తున్నారు. ఆ నీరు రెండు రోజులకు సైతం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల వద్ద డ్రమ్మునీటిని రూ.50వంతున కొనుగోలు చేసుకొని జీవనం సాగించాల్సి వస్తోంది. నీటికి ఇబ్బందిగా ఉంది.

మరియన్న, దూదేకులవీధి, గిద్దలూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని