logo

పశ్చిమ ప్రకాశానికి వరాల జల్లు

మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Published : 04 May 2024 06:19 IST

ఉత్సాహం నింపిన పవన్‌, చంద్రబాబుల పర్యటన

పొదిలిలో ప్రజలను పలకరిస్తున్న చంద్రబాబు, పక్కన అభివాదం చేస్తున్న నారాయణరెడ్డి

పొదిలి, పొదిలి గ్రామీణం, కొనకనమిట్ల, గిద్దలూరు పట్టణం, కంభం, న్యూస్‌టుడే : మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం పొదిలి పట్టణంలోని చిన్న బస్టాండ్‌ వద్ద నిర్వహించిన ప్రజాగళం చైతన్య యాత్రకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. వేలాదిమంది హాజరుకావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా వారి నుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ అరాచక పాలనను ఎండగట్టారు. చుక్క నీటికి విలవిల్లాడుతున్న పొదిలి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చి నీటి అవసరాలు తీరుస్తామన్నారు. స్థానిక పెద్దచెరువు నీటి ప్రాజెక్టు పూర్తిచేసి ఇంటింటికీ కుళాయి ద్వారా నీళ్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పొదిలిలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు రింగ్‌ రోడ్డు మంజూరు చేస్తామని ప్రకటించారు. వైకాపా అయిదేళ్ల పాలనలో జిల్లా అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని, తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే ఇక్కడి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం మార్కాపురం తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పొదిలి, మార్కాపురం పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్‌ నాయకుడు నూకసాని బాలాజీతో పాటు గునుపూడి భాస్కర్‌, కాటూరి నారాయణ ప్రతాప్‌, కందుల విఘ్నేష్‌ రెడ్డి తదితరులు     పాల్గొన్నారు.
గిద్దలూరులో శుక్రవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన తెదేపా, జనసేన నాయకుల్లో ఉత్సాహం నింపింది. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో జనసేన, తెదేపా, భాజపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గిద్దలూరు - నంద్యాల రహదారి బహిరంగసభకు వచ్చిన అభిమానులతో నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం 4.25 గంటలకు గిద్దలూరు - ఒంగోలు రహదారిలోని పోలంరెడ్డి బాలకృష్ణారెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది. హెలిప్యాడ్‌ దిగిన పవన్‌ కల్యాణ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన వాహనంలోకి వెళ్లి 10 నిమిషాల్లో బయటకు వచ్చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు సన్‌రూప్‌ వాహనంలో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సుమారు 30వేల మందికి పైగా అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవన్‌కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో యువత కేరింతలు కొట్టారు.   ఎన్టీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అండగా ఉండి నియోజకవర్గంలోని సమస్యలను తీర్చేందుకు అండగా ఉంటానని పవన్‌ కల్యాణ్‌ తెలపడంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. సభకు యువత, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని