logo

‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్‌, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు.

Updated : 07 May 2024 08:37 IST

మితిమీరిన వైకాపా నేతల ఆగడాలు
ఇప్పటికే డొల్లగా సాగిన రీసర్వే ప్రక్రియ
టైటిలింగ్‌ చట్టంతో మరింత ఆందోళన

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్‌, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. గతంలో ఎన్నడూ ఎరగని స్థాయిలో జగన్‌ ఏలుబడిలో ఈ అరాచక పర్వం యథేచ్ఛగా సాగింది. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన స్థలాల్లో జగనన్న జాతిరత్నాలు ఇప్పటికే పాగా వేశాయి. ఒంగోలు నగరంలోనే ఓ ముఠా దాదాపు రూ.200 కోట్ల విలువైన స్థలాలను మింగేశారు. ఖాళీగా కనిపించిన స్థలాలను అనుచర గణంతో గుంజుకున్నారు. ‘భూ’చోళ్ల అవతారమెత్తి దేవాలయ భూములనూ దిగమింగారు. పామూరులోని మదన వేణుగోపాలస్వామి, శ్రీవల్లీ భుజంగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన రూ.120 కోట్లకు పైగా విలువైన స్థలాలను ఆక్రమించుకున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే జనం తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ భయం భయంగా గడుపుతున్నారు. ఇటీవల వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023’తో మరింతగా ఆందోళన చెందుతున్నారు.

ఈనాడు, ఒంగోలు: జగనన్న భూహక్కు- భూరక్ష పథకంలో భాగంగా జిల్లాలోని 822 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకి అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 266 గ్రామాల్లో పూర్తిచేశారు. అందులో 194 ఊళ్లలో భూముల సరిహద్దులు నిర్ణయించి.. ఆ మేరకు 61,636 మంది రైతులకు హక్కు పత్రాలు అందించినట్లు అధికారులు ప్రకటించారు. తీరా చూస్తే ఈ పత్రాల్లో చాలా వరకు తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దుకోవడానికి రైతులు ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పట్టించుకున్న వారు ఎవరూ లేరు.

రాళ్లు పాతి.. వివాదాలు పెంచి...

జిల్లాలో భూవివాదాలు ఎక్కువ. 2023కు మొదటి విడత చేపట్టిన రీసర్వే వీటిని పరిష్కరించకపోగా మరింత పెంచింది. ఆర్భాటంగా హద్దురాళ్లు పాతి కొందరికి భూరక్షణ హక్కు పత్రాలు కూడా అందజేశారు. అదే సమయంలో సరిహద్దులు సక్రమంగా చూపలేదని, రాళ్లు కూడా సరిగా పాతలేదని, హక్కుపత్రాల్లోనూ వివరాలు తప్పుగా నమోదయ్యాయంటూ పలువురు అధికారులను నిలదీశారు. స్పందన కార్యక్రమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ చిక్కులకు మీరు కాదా కారణం..!

జగనన్న భూహక్కు- భూరక్ష పథకంలో భాగంగా జిల్లాలో మొదటి దశలో సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెంలో రీసర్వే చేపట్టారు. అంతకుముందు ఆ గ్రామంలో 861.52 ఎకరాల భూములున్నాయి. రీసర్వే తర్వాత సదరు విస్తీర్ణం 863.65 ఎకరాలకు పెరిగినట్లు చూపడంతో అనేక సమస్యలు తలెత్తాయి.

  • గురవారెడ్డిపాలేనికి చెందిన ఎనభై ఏళ్ల వృద్ధుడు వెంకారెడ్డికి సర్వే నంబరు 77లో 37 సెంట్ల భూమి ఉంది. రీసర్వే తర్వాత నాలుగు తక్కువతో 33 సెంట్లకు పాసుపుస్తకం ఇచ్చారు. అదేమని కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.‌
  • సర్వే నంబర్‌ 117లో అయిదుగురు రైతులకు 8.24 ఎకరాల పొలం ఉంది. రీసర్వే తర్వాత 8.16 ఎకరాలు మాత్రమే చూపారు. తగ్గిన ఎనిమిది సెంట్లను అయిదుగురు రైతులకు సమానంగా తగ్గించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. ‌
  • మరో రైతుకు సర్వే నంబర్లు 6/8,9, 52లో మూడుచోట్ల కలిపి పది సెంట్లు తక్కువ వచ్చింది. భూమి తక్కువ రావడంపై ఆందోళన చెందిన సదరు రైతు.. మరోమారు సర్వే చేపట్టాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
  • ఫత్తెపురం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఎకరా భూమిని 0.33 ఎకరాలు చొప్పున పంచుకున్నారు. మూడు భాగాలకు వేర్వేరుగా హద్దు రాళ్లు వేయకుండా ఒక్క భాగానికి మాత్రమే అధికారులు పాతారు. ఇదే గ్రామంలో మరో మహిళ రీసర్వే సమయంలో ఇంటి వద్దలేరు. దీంతో తనకున్న 1.33 ఎకరాలను రీసర్వే చేయలేదు. తర్వాత అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు.

గందరగోళం.. అన్నదాతల్లో అయోమయం

రీసర్వే ప్రక్రియ పూర్తయిన గ్రామాలకు కొత్త ఎల్‌పీఎం నంబర్లు, పాత సర్వే నంబర్ల వివరాలతో అధికారులు చిత్రపటాలను సిద్ధం చేశారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం వచ్చేలా చేసినట్లు ప్రకటించారు. డ్రోన్‌ సర్వే ఎప్పుడు చేశారో కూడా తెలియకుండానే రైతులకు హక్కు పత్రాలు ఇచ్చారు. గందరగోళంగా రీసర్వే చేసి ఇచ్చిన పత్రాలు కచ్చితంగా లేకపోవడం, పొరపాట్లతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని