logo

చంద్రన్న రాగానే ముస్లింలకు పింఛన్లు

మైనార్టీల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని, చంద్రబాబు అధికారంలోకి రాగానే యాభై ఏళ్లు దాటిన ముస్లింలందరికీ పింఛన్లు అందిస్తారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ.షరీఫ్‌ తెలిపారు.

Published : 09 May 2024 03:24 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మైనార్టీల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని, చంద్రబాబు అధికారంలోకి రాగానే యాభై ఏళ్లు దాటిన ముస్లింలందరికీ పింఛన్లు అందిస్తారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ.షరీఫ్‌ తెలిపారు. ఒంగోలు నగరంలోని 4వ డివిజన్‌లో అసెంబ్లీ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కేటాయించిన వేల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించి రాష్ట్రంలో ముస్లిం సోదరులకు జగన్‌ ద్రోహం చేశారని  విమర్శించారు. ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తానని చెప్పి ఆ వర్గాన్ని మోసం చేశారన్నారు. తన పాదయాత్రలో వారికిచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించారని విమర్శించారు. పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, 1991 నుంచి తమ కుటుంబం ప్రజాసేవలో ఉండి అనేక కార్యక్రమాలు చేస్తోందని, ఈ సారి ఎన్నికల్లో దీవించాలన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే చట్టసభల్లో పోరాడతామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ, ముస్లింలకు ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే తనను దాటి రావాల్సి ఉంటుందన్నారు. వారికి ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలకు ఒరిగింది ఏమి లేదన్నారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, రాష్ట్ర మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు షేక్‌ కపిల్‌ బాషా, నాయకులు ఆఫీద్‌ మౌలానా, షేక్‌ అమ్రుల్లా, షేక్‌ అల్లాభక్షు పాల్గొన్నారు.


తెదేపాతోనే అభివృద్ధి, సంక్షేమ పాలన

కొత్తపట్నం, న్యూస్‌టుడే: తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కూటమి తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి  పేర్కొన్నారు. కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల, రాజుపాలెం, గవండ్లపాలెం, కె.పల్లెపాలెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రచారంలో వారు మాట్లాడారు. తెదేపాతోనే అభివృద్ధి, సంక్షేమ పాలన... యువతకు ఉపాధి అవకాశాలు సాధ్యమని పేర్కొన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, భాజపా నాయకుడు యోగయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని