logo

మర్యాదగా రాజీనామా చేయండి

‘మర్యాదగా రాజీనామా చేయండి. రూ.5 వేలు నగదు బహుమతిగా పొందండి. ఇదే చివరి మీటింగ్‌. ఇన్ని రోజులు పార్టీ కోసం చేసింది ఒక లెక్క. రానున్న మూడు రోజులు చేసేది ఒక లెక్క. మీరు క్లస్టర్‌ స్థాయిలో తిరిగి, ఓటర్లకు తాయిలాలు పంచాలి.

Published : 10 May 2024 01:56 IST

రూ. 5 వేలు నగదు పొందండి
కనిగిరిలో వైకాపా నేతల బరితెగింపు

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ వాలంటీర్‌కు వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌

కనిగిరి, న్యూస్‌టుడే: ‘మర్యాదగా రాజీనామా చేయండి. రూ.5 వేలు నగదు బహుమతిగా పొందండి. ఇదే చివరి మీటింగ్‌. ఇన్ని రోజులు పార్టీ కోసం చేసింది ఒక లెక్క. రానున్న మూడు రోజులు చేసేది ఒక లెక్క. మీరు క్లస్టర్‌ స్థాయిలో తిరిగి, ఓటర్లకు తాయిలాలు పంచాలి. అవసరమైతే ఏజెంట్లుగా బూత్‌లలో ఉండాలి. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మిమ్మలను తిరిగి వాలంటీర్లగా తీసుకోదు. మన ప్రభుత్వం వస్తే కొత్త వారికి, రిజైన్‌ చేసిన వారికి తిరిగి విధుల్లోకి తీసుకుంటారంటా. ఇది పై నుంచి వచ్చిన ఆర్డర్‌. ఇప్పటికే 52 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోపు స్థానిక వైకాపా కార్యాలయానికి వచ్చి అందరూ రాజీనామా సమర్పించాలి. రాజీనామా పత్రాలను మున్సిపల్‌ కమిషనర్‌కు ఇవ్వను, మా వద్దే ఉంచుకుంటాం, ఎవరైనా విలేకరులు, అధికార్లు మిమ్మలను అనుమానిస్తే మా వద్ద మీరిచ్చిన రాజీనామా పత్రాన్ని చూపుతాము, లేకుంటే మీరు మీ ఇష్ట ప్రకారం ఇంటింటికి వెళ్లి తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలి.’ ఇదీ.. కనిగిరి పట్టణంలోని వాలంటీర్లను వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా గురువారం స్థానిక వైకాపా కార్యాలయానికి రప్పించి రాజీనామాలు చేయించిన వైకాపా నేతల బరితెగింపు.

150 మందితో రాజీనామా చేయించి..

కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 12 సచివాలాయల్లో 210 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇప్పటికి 49 మంది రాజీనామా చేయగా గురువారం మరో 150 మందిచేత భయపెట్టి బలవంతంగా రాజీనామా చేయించారు. మిగిలిన 11 మంది తాము రాజీనామా చేయబోమని వైకాపా కార్యాలయం నుంచి ఎదిరించి వెళ్లిపోయారు. రీజినల్‌ కోఆర్దినేటర్‌ మాట్లాడుతారని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను వైకాపా కార్యాలయానికి రప్పించారు. రాజీనామా చేసిన వాలంటీర్లకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు. మీరు ఇపుడు డబ్బులు తీసుకుని రాజీనామా చేసి వెళితే మన ప్రభుత్వం వస్తే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. రాజీనామా చేసిన వాలంటీర్లనే పోలింగ్‌ ఏజెంట్లుగా నియమిస్తే వైకాపాకు ఓటేసే వారెవరు, తెదేపాకు ఓటేసేవారెవరనేది వాలంటీర్లు గుర్తిస్తారని, తెదేపాకు ఓటు వేయకుండా అక్కడికక్కడే ఓటర్లను బెదిరింపులకు గురి చేయవచ్చని వైకాపా నాయకులు భావించి ఈ తతంగాన్ని నడుపతున్నారు.

ఎదురు తిరిగిన 11 మంది వాలంటీర్లు

వైకాపా నాయకులు ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా 11 మంది వాలంటీర్లు మాత్రం రాజీనామా చేయకుండా ఎదురు తిరిగారు. మేము ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నాం...మీరెవరు మా మీద పెత్తనం చేయడానికి .. మీ రూ. 5 వేలు మాకొద్దు. కొత్త ప్రభుత్వం వస్తే మమ్మలను ఎందుకు తొలగిస్తుంది. చంద్రబాబు స్వయంగా రూ., 10వేలు ఇస్తానన్నాడు.. అలాంటపుడు మీకేమి సంబందం అంటు ఎదురు తిరిగి రావడం విశేషం. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి,  అధికార్లు అధికార పార్టీ వాలంటీర్ల రాజకీయాన్ని గమనించి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. వాలంటీర్లగా రాజీనామ చేసి తాయిలాలు పంచుతున్నవారిని, ఏజెంట్లగా ఉండే వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరంఎంతైన ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని