logo
Published : 30/11/2021 04:36 IST

అయ్యా..! కావాలి మీ స్పందన..!


జిల్లా కేంద్రంలో అర్జీలు రాయిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు

జిల్లా, డివిజన్‌ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ‘స్పందన’ కార్యక్రమానికి పెద్దఎత్తున వినతులొస్తున్నా పరిష్కారాలు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదు. తమ గోడు వినిపించడం తప్ప ఫలితం ఉండటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులను కలిస్తే మండల స్థాయిలో కలవాలని, అక్కడికి వెళితే పైవాళ్ల దగ్గరకు వెళ్లండంటూ తిప్పుతున్నారని వాపోతున్నారు. వచ్చిన అర్జీలు ఏమవుతున్నాయి? ఎంత మేరకు పరిష్కారమవుతున్నాయి? ఎక్కడ ఆలస్యమవుతోంది? వంటి అంశాలపై దృష్టిసారించకనే ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమాన్ని ‘న్యూస్‌టుడే’ పరిశీలించింది. బాధితుల మనోగతం తెలుసుకుంది.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌, పాలకొండ, టెక్కలి

గతంలో ఇలా..

వినతుల పరిష్కారం, అర్జీదారులు ఏ మేరకు సంతృప్తి చెందుతున్నారు వంటి అంశాలపై గతంలో ప్రతి వారంలో ఒకరోజు సమీక్ష జరిగేది. అన్ని మండల, జిల్లా ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఫలితంగా ఈ ప్రక్రియ నామమాత్రంగా మారిపోయింది. ఉన్నతాధికారులు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

జిల్లా కేంద్రంలో బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు సంబంధిత శాఖాధిపతికి పంపిస్తున్నారు. అక్కడితో అది పరిష్కారమైపోయినట్లు సాంకేతికంగా లెక్కల్లో చూపుతున్నారు. కానీ క్షేత్రస్థాయికి వెళ్లేసరికి ఏదో ఒక కొర్రీ వేసి నిలిపివేస్తున్నారు. కొందరు వాటిని పట్టించుకోవడమే లేదు. భూ ఆక్రమణలు, సామాజిక అంశాలపై వచ్చిన వాటికి సమయం పట్టినా, కనీసం వ్యక్తిగత సమస్యలకూ మార్గం చూపడం లేదు. సమస్యకు కారణం ఏమిటో, ఎక్కడ పరిష్కరించుకోవాలో తెలియక బాధితులు అవస్థలు పడుతున్నారు. మండల, డివిజన్‌ స్థాయిలో పరిష్కారం లభించక చాలామంది జిల్లాస్థాయిలో జరిగే ‘స్పందన’కు వరుస కడుతున్నారు. ఈ సంవత్సరంలో సుమారు 2,800 మంది తమ సమస్యలకు దక్కిన పరిష్కారాలతో సంతృప్తి చెందక మరోసారి పరిశీలన కోరుతూ స్పందన మెట్లు ఎక్కారు. దీనిని బట్టి అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్ఛు


ఈ వారం నుంచే జేసీలతో సమీక్ష..

పెండింగ్‌ అర్జీలపై జాయింట్‌ కలెక్టర్లు ఈ వారం నుంచే ప్రత్యేకంగా సమీక్షిస్తారు. జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడి ఎక్కడ ఆలస్యమైందో గమనించి వాటిని సరిచేస్తారు. గడువులోగా కచ్చితంగా సమస్యకు పరిష్కారం చూపించాల్సిందే. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం మొత్తం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

- శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టరు


పదో తరగతి టీసీ కావాలంటున్నారు..

నేను రిక్షా తొక్కుకుంటూ బతుకుతున్నా. నాకు ఎప్పుడో 60 ఏళ్లు దాటేశాయి. వృద్ధాప్య పింఛను కోసం రెండేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా. ఆధార్‌లో వివరాలు తప్పుగా పడ్డాయంటున్నారు. సరిచేయాలంటే పదోతరగతి టీసీ తీసుకురావాలంటున్నారు. నేను చదివింది 5 వరకే. ఆ టీసీ చూపుతున్నా చెల్లదంటున్నారు. పింఛను, ఆధార్‌ మార్పు కోసం ఇప్పుడు నేను పదోతరగతి చదివే పరిస్థితి లేదు. ఈ ఏడాదిలో మూడుసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

-కుప్పిలి తవుడు, బొబ్బిలి సెంటర్‌, ఎస్సీకాలనీ, రాజాం


వితంతు పింఛనుకు వయసు కావాలట..

నా భర్త చనిపోయి 20 ఏళ్లవుతోంది. పదేళ్లుగా వితంతు పింఛను పొందాను. ఆధార్‌ కార్డులో వయసు తక్కువగా ఉందని చూపి పింఛను నిలిపేశారు. ఈ పింఛనుకు వయసుతో సంబంధం ఏమిటో తెలియడం లేదు. నాలుగు నెలలుగా వచ్చి అర్జీ పెట్టుకుంటున్నా పరిష్కరించే వారు కరవయ్యారు.

- వి.విజయలక్ష్మి, చంపాగల్లివీధి, శ్రీకాకుళం

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని