logo

గంగమ్మా.. నువ్వొచ్చే దారేదమ్మా..?

జిల్లా పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో వర్షపాతం నమోదు ఏటా తక్కువగానే ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధిగమించేందుకు.. పొలాలను సస్యశ్యామలం చేయాలనే  లక్ష్యంతో గత ప్రభుత్వాలు తోటపల్లి జలాశయం నుంచి నీటి సరఫరాకు సంకల్పించాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం బ్రాంచి కాలువ నిర్మించి

Updated : 06 Aug 2022 04:11 IST

న్యూస్‌టుడే, లావేరు

రణస్థలం మండలం కొండములగాం వద్ద  ప్రధాన కాలువ  దుస్థితి ఇది.. చుక్కనీరు

వచ్చిన దాఖలాలు లేవు..

జిల్లా పరిధిలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో వర్షపాతం నమోదు ఏటా తక్కువగానే ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధిగమించేందుకు.. పొలాలను సస్యశ్యామలం చేయాలనే  లక్ష్యంతో గత ప్రభుత్వాలు తోటపల్లి జలాశయం నుంచి నీటి సరఫరాకు సంకల్పించాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం బ్రాంచి కాలువ నిర్మించి నీరివ్వాలని అధికారులు భావించారు. బాలారిష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. వేలాది ఎకరాలకు చుక్కనీరు రాక బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి.

తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది కూడా రణస్థలం, లావేరు మండలాలకు పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి కనిపించడం లేదు. గత మూడేళ్లగా చుక్కనీరు రాకపోవడంతో పొలాలను ఖాళీగా వదిలేసుకోవాల్సిన దుస్థితి. గత ప్రభుత్వ హయాంలో కాలువ తవ్వకాలు చేపట్టిన మేరకు వాటికి ఆనుకుని ఉన్న చెరువులకు నీరు విడుదల చేసి నింపేవారు. రైతులు దమ్ము చేసుకుని ఉభాలు వేసే అవకాశముండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్నిచోట్ల కాలువలు శుభ్రంగా ఉన్నప్పటికీ నీరు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. గతంలో జూన్‌ నెల చివరి వారం లేక జులైలో కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసేవారు. ప్రస్తుతం ఆగస్టు నెల వచ్చినప్పటికి చుక్క విడుదల చేయలేదు.

అసంపూర్తి పనులే..

తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయిలో భూసేకరణపై దృష్టి పెట్టడం లేదు. సేకరించిన భూమికి సైతం ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడంతో రైతులు తమ భూముల నుంచి కాలువలు తవ్వేందుకు నిరాకరిస్తున్నారు. దీంతోపాటు కొన్నిచోట్ల సగం సగం తవ్వకాలు చేపట్టి వదిలేశారు. లావేరు మండల కేంద్రం మీదుగా వేణుగోపాలపురం, బొంతుపేట, బెజ్జిపురం, గుమ్మడాం, వాళ్లేపేట, నాగంపాలెం, సూర్యనారాయణపురం, బుడతవలస, బెజ్జిపురం తదితర గ్రామాల పరిధిలో ఇంకా తవ్వకాలు చేపట్టాల్సి ఉంది.

లావేటిపాలెం సమీపంలో ఆనవాళ్లే కనిపించని కాలువ

అడుగంటిన జలాలు..

ప్రస్తుతం రణస్థలం, లావేరు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు. బోర్ల ద్వారా పంటలు పండిద్దామంటే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా ఈ ప్రాంతాల్లోనే బోర్లు ఉండటం,  పరిశ్రమలు కూడా భూగర్భజలాలనే వినియోగిస్తుండటంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తోటపల్లి నీరు ఇక్కడి వారికి అందించడం తప్పనిసరి.  

ఇవీ అడ్డంకులు

* రణస్థలం, లావేరు మండలాలకు సంబంధించి సుమారు 32 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉంది.

* రణస్థలం మండలంలో 126 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇంకా 56 కి.మీ. మేర పనులు ఆగిపోయాయి.

* లావేరులో 50 కిలోమీటర్లకు గాను మరో 12 కి.మీ కాలువ తవ్వకాలు చేపట్టాల్సింది. ఇవి పూర్తయితే తప్ప పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి లేదు.

* రెండు మండలాల్లోనూ కాలువలు తవ్వడానికి భూసేకరణే అడ్డంకి. కొన్ని చోట్ల స్థలాల సేకరణలో వివాదాలు కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాలి.

* పనుల పూర్తికి ఇంకా రూ.482 కోట్లు, కాలువల్లో స్ట్రక్చర్ల నిర్మాణానికి మరో రూ.12 కోట్లు నిధులు అవసరం ఉంది.


చిన్నచూపు తగదు..

ఎంతో ఆశగా కాలువల తవ్వకాలకు తక్కువ ధరకు జిరాయితీ భూములు ఇచ్చాం. గడిచిన మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఖరీఫ్‌ ప్రారంభమైనప్పటికి నీరు రావడం లేదు. ప్రభుత్వం, అధికారులు అన్నదాతల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పంటల సాగుకు అవసరమైన నీరు విడుదల చేయాలి. లేకుంటే వందలాది ఎకరాల భూమిని వదిలేయాల్సి ఉంటుంది.

- లంకపల్లి అచ్యుతరావు, రైతు, లావేటిపాలెం


గుత్తేదారుపై ఒత్తిడి తెస్తున్నాం..

‘కాలువ తవ్వకాలకు గుత్తేదారుపై ఒత్తిడి తెస్తున్నాం. గతంలో ఉన్నవారు మారిపోయారు. ప్రస్తుతం మరొకరికి పనులు అప్పగించాం. కొన్నిచోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా భూసేకరణ సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కాలువల ద్వారా చీపురుపల్లి మండలం నడిపల్లి వరకు సాగునీరు వచ్చింది. తవ్విన కాలువల వరకు ఈ వారంలో నీరందిస్తాం.’

- టి.హరిప్రసాద్‌, డీఈఈ, తోటపల్లి ప్రాజెక్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని