logo

రేషన్‌ అక్రమాలపై డేగకన్ను

ప్రజాపంపిణీ వ్యవస్థలో పేదలకు రేషన్‌బియ్యం పంపిణీలో అక్రమాలు సర్వసాధారణం అవుతున్నాయి.

Updated : 28 Nov 2022 06:06 IST

ఎండీయూ వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం

కవిటి, న్యూస్‌టుడే: ప్రజాపంపిణీ వ్యవస్థలో పేదలకు రేషన్‌బియ్యం పంపిణీలో అక్రమాలు సర్వసాధారణం అవుతున్నాయి. అక్రమాల నిరోధానికి ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు సరికొత్త విధానాలతో దోపిడీకి తెరతీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్రమాలకు చెక్‌ చెప్పేందుకు సరికొత్త సాంకేతిక విధానం అమలుకు సమాయత్తం అయ్యింది. ఎండీయూ వాహనాలకు జీపీఎస్‌, సీసీ కెమెరాల అమరికకు ప్రణాళికలు రూపొందించారు. ప్రయోగాత్మకంగా జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒక వాహనానికి జీపీఎస్‌ అనుసంధానం చేయనున్నారు. తదుపరి పూర్తి స్థాయిలో ఎండీయూ వాహనాలకు సాంకేతికత అమలుకు సమాయత్తం అవుతున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా....

జిల్లాలోని 6.58 లక్షల మంది కార్డుదారులకు ప్రతినెలా ఎండీయూ (మొబైల్‌ డిస్పెనింగ్‌ యూనిట్లు) వాహనాల్లో బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్‌ అందించడంలో భాగంగా సరాసరిన రూ.7 లక్షల వ్యయంతో ఒక్కో ఎండీయూ వాహనం కొనుగోలు చేసి ఆపరేటర్లను నియమించారు. ఇంత చేస్తున్నా.. ఇంటింటికీ రేషన్‌ సక్రమంగా అందించకపోవడం, రేషన్‌కు బదులు డబ్బులు చెల్లించడం, దళారులు లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేయడం వంటి అక్రమాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని పటిష్ట చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతి వాహనానికి జీపీఎస్‌ వ్యవస్థ అనుసంధానం చేయనుంది. వాహనాలకు సీసీ కెమేరాలు అమర్చి జిల్లా, అనుబంధ పౌరసరఫరాల శాఖల కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి.


 పారదర్శకంగా పంపిణీ....

ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో పారదర్శకత పెంపొందించేందుకు జీపీఎస్‌ విధానం త్వరలో అమలు చేయనున్నాం. గతంలో గుర్తించిన లోపాలు, అక్రమాల నిరోధానికి జీపీఎస్‌ ఉపకరిస్తుంది. వీధిలో నాలుగైదు చోట్ల వాహనంలో రేషన్‌ పంపిణీ చేయాలి. ముందుగా మండలానికి ఒక వాహనానికి జీపీఎస్‌ అమర్చి పనితీరు పరిశీలిస్తాం. దశలవారీగా అన్ని వాహనాలకు అమలు చేస్తాం. ఈ మేరకు మండలాల వారీగా కార్యాచరణ రూపొందిస్తున్నాం.

- డి.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి, శ్రీకాకుళం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని