logo

ఆధునికీకరణపైనే ఆశలు

పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట వద్ద నెలకొన్న ఇబ్బందులతో నీటిలభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ప్రధానకాల్వ లోపంతో పక్కనే ఉన్న పంటపొలాలు సైతం బీళ్లుగా మారుతున్నాయి.

Updated : 27 Mar 2023 06:14 IST

దుస్థితిలో పైడిగాం ప్రాజెక్టు
ప్రధానకాల్వ నిర్మాణ లోపంతో ఇబ్బందులు
న్యూస్‌టుడే, సోంపేట

ఆనకట్ట నిర్మించాల్సిన చీకటిగెడ్డ ప్రాంతం...

పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట వద్ద నెలకొన్న ఇబ్బందులతో నీటిలభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ప్రధానకాల్వ లోపంతో పక్కనే ఉన్న పంటపొలాలు సైతం బీళ్లుగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో పదివేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు అధునికీకరించకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదముంది.

రూ.36 కోట్లతో ప్రతిపాదనలు: పైడిగాం అధునికీకరణకు రూ.36 కోట్ల అంచనావ్యయంతో ప్రతిపాదనలు పంపించారు. వీటికి అనుమతులు వస్తే జలవనరుల నిపుణుల కమిటీ పరిశీలించి కొత్త నిర్మాణాల విషయమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహేంద్రతనయ నదిపై బాతుపురం ఎగువభాగంలో నిర్మించిన ఆనకట్ట తిత్లీ వరదకు కొట్టుకుపోయింది. ఆనకట్ట వద్ద నదిలో చిన్నకాల్వ ఏర్పాటు చేసి నీటిని ప్రధానకాల్వలోకి మళ్లించేందుకు అధికారులు చేపట్టిన చర్యలకు అక్రమ ఇసుక తవ్వకాలు అవరోధంగా మారాయి. నది లోతు పెరిగిపోయి 185 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 40 క్యూసెక్కులు కూడా చేరడంలేదు. రైతు నిపుణుల సూచనల మేరకు ప్రధానకాల్వ పరిధిలో 2.2 కి.మీ, లేదా 3.2 కి.మీ. వద్ద చీకటిగెడ్డ పరిధిలో ఆనకట్ట నిర్మిస్తే నీటిసరఫరా మెరుగుపడుతుంది. రెండు నియోజకవర్గాల పరిధిలో 10వేల ఎకరాలకు పైగా పంటభూములకు ఖరీఫ్‌, రబీల్లో సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆనకట్ట నిర్మిస్తే ప్రధానకాల్వ 6 మీటర్ల వరకు లోతు పెంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తూర్పు కనుముల నుంచి వచ్చే వరదనీటిని నిల్వచేసేందుకు వీలుగా లెడ్డగుడ్డి వద్ద మినీ రిజర్వాయర్‌ నిర్మించి ప్రధానకాల్వతో అనుసంధానం చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.

ఒడిశా చర్యలతో..: పురియాసాహి వద్ద ఒడిశా ప్రభుత్వం నదిపై 20 మీటర్లకు పైగా ఎత్తులో నిర్మించిన నిర్మాణాలతో ప్రాజెక్టు వద్దకు కనీస స్థాయిలో కూడా నీరు రావడం లేదు. వాటానీటి విడుదల విషయమై ఒడిశాతో పదిహేనేళ్ల కిందట పలుమార్లు అధికారులు, ఎంపీలు, మంత్రులస్థాయిలో సమావేశాలు జరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పట్లో ముఖ్యమంత్రి కూడా ఆ ప్రభుత్వానికి లేఖ రాసి కట్టడాల ఎత్తు తగ్గించాలని కోరినా స్పందన లేకుండా పోయింది. దీంతో ఒడిశాకు భారీగా వరదలు సంభవిస్తే తప్ప నదిలోకి అక్కడ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.


అలా చేస్తేనే..: ప్రధానకాల్వ నిర్మాణంలో లోపం ఉంది. అప్పటి పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు. ఆనకట్టను చీకటిగెడ్డ లేదా 3.2 కి.మీ. వద్దకు మార్చి, హంసమేర వద్ద మినీ రిజర్వాయర్‌ నిర్మిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు. నాలుగు దశాబ్దాలుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలి.

బుద్దాన లోకనాథం, పైడిగాం ఆయకట్టు రైతు ప్రతినిది


నిపుణుల పరిశీలనతోనే..: రూ.36 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపించాం. ఆనకట్ట మార్చాలన్నా, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నా జలవనరుల నిపుణుల పరిశీలనతోనే జరగాల్సి ఉంటుంది. నిధులు మంజూరైతే పనులు చేపడతాం.

రమేష్‌, డీఈఈ, జలవనరులు


ప్రభుత్వం పరిశీలనలో ఉంది: పైడిగాం విషయమై ముఖ్యమంత్రి, జలవనరుల మంత్రితో కలిసి చర్చించాం. నిధుల మంజూరుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు అభివృద్ధికి తప్పకుండా చర్యలు చేపడతాం.

పిరియా విజయ, జడ్పీ అధ్యక్షురాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని