logo

జగనన్నా.. ఇదెక్కడి న్యాయం?

వంశధార నిర్వాసితులకు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారిపోయాయి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా అదనపు పరిహారం ఇస్తామన్నారు.

Published : 04 Aug 2023 06:26 IST

వంశధార నిర్వాసితులకు పూర్తిస్థాయిలో అందని అదనపు పరిహారం
కాళ్లరిగేలా తిరుగుతున్న తప్పని ఎదురుచూపులు
న్యూస్‌టుడే, హిరమండలం, కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), అర్బన్‌

వంశధార నిర్వాసితులకు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారిపోయాయి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా అదనపు పరిహారం ఇస్తామన్నారు. ఆ విధంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. కానీ కొందరికి మొండిచేయి చూపించారు. ఏడాది గడిచినా చాలా మంది నిర్వాసితులు లబ్ధి అందక లబోదిబోమంటున్నారు. ఊళ్లను వదిలేసి.. భూములను కోల్పోయిన బాధితులు న్యాయం  జరగక  కన్నీటి పర్యంతమవుతున్నారు.


వచ్చేది మన ప్రభుత్వమే.. అప్పుడు కచ్చితంగా అందరికీ మిగిలిన పరిహారం అందిస్తాం. ఎలాంటి అవకతవకలు లేకుండా 2013 భూ సేకరణ చట్టాన్ని మనస్ఫూర్తిగా అమలు చేస్తే ప్రతి ఇంటికీ మేలు జరుగుతుంది. కచ్చితంగా అది చేస్తాం. మొత్తం 11 వేల కుటుంబాలకు న్యాయం చేస్తాం.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వంశధార ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చిన హామీ ఇది.


వంశధార రిజర్వాయర్‌ పనులను రూ.1,624 కోట్ల వ్యయంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. 18 ఏళ్లుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు హిరమండలంలోని 13 గ్రామాలు, కొత్తూరులో 5, ఎల్‌ఎన్‌పేటలో 1 మొత్తం 19 గ్రామాలకు చెందిన సుమారు పది వేల కుటుంబాలు నిర్వాసితులుగా మారారు. అప్పట్లో వీరికి పునరావాసం, పునర్నిర్మాణం(ఆర్‌అండ్‌ఆర్‌) ద్వారా ఎకరాకు రూ.1.30 లక్షల చొప్పున పరిహారంఅందించారు. ఆ సొమ్మును ఒక్కసారిగా కాక దశల వారీగా 2005 నుంచి 2018 వరకు చెల్లించారు. పరిహారం చెల్లింపులో జాప్యం జరగడం, అప్పుడున్న భూముల ధర 2017లో ఊర్లు ఖాళీ చేసేనాటికి పదిరెట్లు పెరిగాయి. దీంతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు విలువైన భూములు కోల్పోయి ప్రస్తుతం రోజు కూలీలుగా మారారు.

రూ.67 కోట్ల వరకు రావాలి..

2013 భూ సేకరణ చట్టానికి ప్రత్యామ్నాయంగా వైకాపా ప్రభుత్వం అదనపు పరిహారం ప్రకటించింది. దీనికి సంబంధించి 2022 జూన్‌లో రూ.216 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబానికి పీడీఎఫ్‌ కింద రూ.లక్ష, యూత్‌ ప్యాకేజీ రూ.లక్ష, భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 10,893 నిర్వాసిత కుటుంబాలకు పీడీఎఫ్‌ కింద ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున రూ.108.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలి. ఇప్పటి వరకు 8,811 కుటుంబాలకు రూ.88.11 కోట్లు చెల్లించారు. మిగతా 2,082 కుటుంబాలకు సొమ్ము జమ కాలేదు. మరోవైపు 9,580 ఎకరాల భూముల్ని రైతులు కోల్పోయారు. ఎకరాకు  రూ.లక్ష చొప్పున మొత్తం రూ.95.80 కోట్లు చెల్లించాలి. కానీ 6,047 ఎకరాలకు రూ.60.47 కోట్లు జమైంది. మిగతా సొమ్ము పెండింగ్‌లో ఉంది. డబ్బులు అందని నిర్వాసితులు సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీ, రైతుల భూములకు దాదాపు రూ.67 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంది.


వీరందరికీ చెల్లించలేరట..

గతంలో పరిహారం, ప్యాకేజీలు పొంది మరణించినవారి వారసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారికి అదనపు పరిహారం మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ మేరకు కొందరికి పరిహారం సొమ్ము కూడా చెల్లించారు. మరికొందరికి అందలేదు. వారందరికీ ఇప్పుడు చెల్లించలేమని అధికారులు తేల్చి చెబుతున్నారు. కొంతమందికి ఇచ్చి.. మిగిలినవారికి ఇవ్వకపోవడమేంటని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.


ఎంత మందికి వచ్చిందో తెలీదు..
- పి.బుచ్చిబాబు, దుగ్గుపురం గ్రామం నిర్వాసితుడు, జడ్పీటీసీ సభ్యుడు, హిరమండలం

మా కుటుంబంలో ఒకరికి అదనపు పరిహారం కింద రూ.లక్ష రాలేదు. మా తండ్రి పేరుతో ఉన్న భూమికి రూ.1.80 లక్షలు రావాల్సి ఉన్నా అదీ అందలేదు. గతంలో డీ పట్టా భూమికి రెవెన్యూ అధికారులు ఎల్‌వోసీ ఇచ్చినప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ఇలాంటి రైతులు నిర్వాసిత గ్రామాల్లో 300 మంది వరకు ఉన్నారు. అసలు ఎంత మందికి అదనపు పరిహారం ఇచ్చారనే జాబితా ప్రకటించలేదు. శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులకు కోరుతున్నా స్పందించడం లేదు.


జీవితాలు చెల్లాచెదురు..
- జి.లింగేశ్వరరావు, పాడలి

మా స్వగ్రామం హిరమండలంలోని తులగాం. వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లం. ఊరంతా సందడిగా ఉండేది. కానీ ప్రాజెక్టు నిర్మించడంతో గ్రామస్థులంతా వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఊరికొకరం అయిపోయాం. ఆ రోజులు తలచుకుంటేనే ఏడుపొస్తోంది. ప్రభుత్వం పూర్తిస్థాయి న్యాయం చేయకుండా మా జీవితాలను చెల్లాచెదురు చేసింది. నాకు 2.80 ఎకరాల భూమి ఉండేది. అదనపు పరిహారం కేవలం రూ.50 వేలు మాత్రమే వచ్చింది. ఇంకా రూ.2.17 లక్షలు రావాల్సి ఉంది. భూములు కోల్పోయి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాం. పూర్తి పరిహారం అందించి ఆదుకోవాలి.


నిధులు పెండింగ్‌లో ఉన్నాయి..
- ఎం.నవీన్‌, సంయుక్త కలెక్టర్‌

వంశధార అదనపు పరిహారం చెల్లింపులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేశాం. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి రూ.43 కోట్ల వరకు నిధులు రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ)లో పెండింగ్‌లో ఉన్నాయి. అక్కడ క్లియర్‌ కాగానే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని