logo

YSRCP: వైకాపా పెద్దలకు ఝలక్‌.. ఫలించని వైవీ సుబ్బారెడ్డి మంత్రాంగం

ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు వైకాపా పెద్దలు పాతపట్నంలో అసమ్మతి వర్గంతో చర్చించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Updated : 15 Mar 2024 09:30 IST

మాట్లాడుతున్న వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి

పాతపట్నం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు వైకాపా పెద్దలు పాతపట్నంలో అసమ్మతి వర్గంతో చర్చించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మండల స్థాయి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ నాయకులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కొత్తూరులో వైకాపా నాయకుడు లోతుగెడ్డ తులసీవరప్రసాద్‌ నిరసన గళం వినిపించగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలను ఏకతాటి పైకి తీసుకురావాలని అధిష్ఠానం నిర్ణయించింది.పాతపట్నంలోని పార్టీ కార్యాలయం నుంచి మండల నాయకులకు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ ఉప సమన్వయకర్త ఎం.శ్రీనివాసరావు ఫోన్‌ చేసి సమావేశానికి హాజరుకావాలని కోరారు. వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ నాయకుడు చిన్న శ్రీను, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, నియోజకవర్గ పరిశీలకుడు కె.రాజేశ్వరరావు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే వర్గీయులే హాజరయ్యారు. వారితో పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి పూర్తి స్థాయిలో సహకరించి ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. జడ్పీటీసీ సభ్యులు లింగాల ఉషారాణి (పాతపట్నం), కిలారు త్రినాథరావు (ఎల్‌.ఎన్‌.పేట), ఎంపీపీ టి.మేనక (హిరమండలం), పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ నాయకులు సమావేశానికి హాజరుకాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని