logo

ఆగని అక్రమాలు..

పెట్టుబడి లేని వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.

Published : 30 Mar 2024 04:32 IST

అధికార పార్టీ నాయకుల అండతో యథేచ్ఛగా ఇసుక దోపిడీ

ఇష్టానుసారం తవ్వకాలతో రూపు కోల్పోయిన బాహుదా నది

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం: పెట్టుబడి లేని వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఇష్టానుసారం ఇసుక తవ్వకాలతో జలవనరులు కళావిహీనంగా మారుతున్నాయి. గత ఏడాది వర్షాభావంతో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పంటలు సరిగా పండలేదు. ప్రస్తుత వేసవిలో భూగర్భజలాలు అడుగంటితే గొంతు తడిచేదెలా అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. సొంత ఖజానా నిండాలని..అధికార నాయకుల అండతో ఇసుకాసురులు బరి తెగిస్తున్నారు. ఎన్నికల వేళ అన్ని రహదారులపై నిఘా ఉంది. అధికారుల పర్యటనలు సాగుతున్నా ఇసుక తవ్వకాలకు అడ్డూ అదుపు లేదు.

సొంతంగా ఇంటి పని చేసుకోవాలనుకున్నా.. జగనన్న కాలనీలో పనులు చేయించాలనుకున్నా ఇసుక దొరకదు. మధ్యవర్తుల ద్వారా అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. స్థానికంగా ట్రాక్టరు ఇసుక రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు పంపితే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు పంపడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రధాన రహదారుల మీదుగా రవాణా సాగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి.

రత్తకన్న నుంచి ఒడిశాకు తరలిపోతున్న ఇసుక ట్రాక్టర్‌

ఇదీ పరిస్థితి

అక్రమంగా ఇసుక తరలించే వాహనాలకు నంబర్లు సక్రమంగా ఉండవు. కొన్ని నంబరు ప్లేట్‌ లేకుండానే యథేచ్ఛగా గమ్యస్థానాల వైపు దూసుకుపోతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో దందా సాగుతోంది. కొందరు నది మధ్యలో, వంతెన వద్ద తవ్వకాలు సాగిస్తున్నారు. వంతెనకు అటూ, ఇటూ 100 మీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేయకూడదు. రైలు వంతెన, పాత వంతెన, కొత్త వంతెనలకు మధ్యలో యంత్రాల సాయంతో తవ్వేస్తున్నారు. అదేమని అడిగితే పురపాలక సంఘ పనులు, ప్రభుత్వ నిర్మాణాల కోసమని చెబుతున్నారు. అవసరమైతే ఆయా శాఖల అధికారులను రంగంలోకి దింపుతున్నారు. శాఖాపరమైన నిర్మాణ అవసరాలకు తవ్వకాలు సాగిస్తే అక్కడ సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ ఉండాలి. తవ్విన ఇసుక ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలిస్తున్నా అడ్డుకునే వారు లేకపోవడం గమనార్హం. నది నుంచి ఇసుకను ఎడ్ల బండ్లపై సమీపంలోని తోటలు, ఖాళీ స్థలాలకు తీసుకొచ్చి కుప్పలుగా పోస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల్లో దూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి రోజుకు 300కు పైగా ట్రాక్టర్లలో ఇసుక ఇతర ప్రాంతాలకు చేరుతోందని అంచనా.

అనుమతులు లేకపోతే స్వాధీనం..

ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేసే వారు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఎక్కడికి ఏ అవసరానికి తరలిస్తున్నారనే విషయానికి సంబంధించిన పత్రాలు అధికారుల అనుమతితో ఉండాలి. లేకుంటే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటాం. అన్ని మార్గాల్లో నిఘాను కట్టుదిట్టం చేస్తాం.

టి.ఇమాన్యుయేల్‌రాజు, సీఐ, ఇచ్ఛాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని