logo

ధాన్యం సేకరణ తక్కువే..!

జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది.. ఖరీఫ్‌ కాలంలో ప్రారంభమైన వరి సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గకున్నా కొనుగోళ్లు మాత్రం పెరగలేదు.

Published : 30 Mar 2024 04:43 IST

జిల్లాలో కొన్నది 4.49 మెట్రిక్‌ టన్నులే
రేపటితో ముగియనున్న గడువు
న్యూస్‌టుడే, నరసన్నపేట  

తామరాపల్లి సమీపంలో నీరు లేక ఎండిపోతున్న వరి పైరు

జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది.. ఖరీఫ్‌ కాలంలో ప్రారంభమైన వరి సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గకున్నా కొనుగోళ్లు మాత్రం పెరగలేదు. జిల్లాలో ఈనెల 29వ తేదీ వరకు 4,49,506 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగలిగారు.. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలే ఇందుకు ప్రధాన కారణమని పలువురు రైతులు  వాపోతున్నారు.

వాస్తవానికి ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. వాటిని అమ్ముకునేందుకు సరైన విధానం అమలు కాకపోవడంతో రైతులు ప్రభుత్వానికి విక్రయించేందుకు మొగ్గు చూపలేదు. అధికారులు తీసుకొచ్చిన కొనుగోలు విధానంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. దీంతో సంక్రాంతి ముందే బయట వ్యాపారులకు అమ్ముకున్నారు. దీనికితోడు సాంకేతిక కారణాలు వెంటాడాయి. మిల్లుల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

దాదాపు కొనుగోళ్లు లేనట్లే..

ఖరీఫ్‌ కాలంలో పండిన ధాన్యం కొనుగోలును ఈ నెలాఖరుతో ముగిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ధాన్యం సేకరణ గణనీయంగా తగ్గింది. మరోరోజు మాత్రమే గడువు ఉండగా, జిల్లా వ్యాప్తంగా ధాన్యం అమ్మకాలకు లేకపోవడంతో దాదాపుగా కొనుగోలు తలుపులు మూసినట్టే. గతనెల 29 నాటికి 4.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, నెలరోజుల్లో కేవలం పదివేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.  

రబీలో 20 వేల ఎకరాల్లో సాగు..

జిల్లా వ్యాప్తంగా రబీలో భాగంగా అధికారికంగా జిల్లాలో 12,334 ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అనధికారికంగా 20 వేల ఎకరాలకు పైనే ఉంటుందని అంచనా. ముఖ్యంగా వంశధార కాలువకు సమీపంలోని జలుమూరు, ఎల్‌ఎన్‌ పేట, నరసన్నపేట తదితర మండలాల్లో ఎక్కువగా పంట వేశారు. ఎడమ కాలువ దిగువన నీరు అందుబాటులో ఉన్న వరి పొలాల్లో ఆశాజనకంగా ఉండగా, నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో వరి పైర్లు ఎండిపోతున్నాయి. మరో పదిహేను రోజుల్లో కోతకు వచ్చే పంటను రక్షించుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.

గతేడాది వ్యవసాయ శాఖ నివేదికల ఆధారంగా జిల్లాలో 7.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. గతేడాది ఫిబ్రవరి 24 నాటికి 4.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. అయినప్పటికీ రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మరో 70 వేల మెట్రిక్‌ టన్నుల వరకు విడతల వారీగా కొనుగోలు చేశారు. 2021లో 5.88 లక్షలు, 2022లో 6.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది మాత్రం 4.49 లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని