logo

తీరాన ప్రమాద ఘంటికలు..!

పొన్నాడ పంచాయతీ పరిధి తీర ప్రాంతంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనుమతుల్లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.

Published : 30 Mar 2024 04:45 IST

రైతులకు పెను సవాలుగా మారనున్న ఇసుక తవ్వకాలు
అనుమతుల్లేకున్నా అధికార అండతో సాగుతున్న దందా

ఎచ్చెర్ల మండలం ముద్దాడపేట రేవులో ఇసుక తవ్వకాలు

పొన్నాడ పంచాయతీ పరిధి తీర ప్రాంతంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనుమతుల్లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయానికి సాగునీటి ఇక్కట్లు తప్పవని ఓ వైపు అధికారులూ హెచ్చరిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీ అండతో అక్కడ నుంచే దందా సాగిస్తున్నారు. గతేడాది అక్టోబరులోనే ఇసుక తవ్వకాలకు స్థానిక మండల ప్రజాప్రతినిధి భూమి పూజ సైతం చేశారు. ఇంత జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌

ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని భూగర్భ జలవనరులశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నాగావళి నది, సముద్రం నీరు కలిసే ప్రదేశానికి సమీపంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. సముద్రపు పోటు(ఆటు-పోట్లు) నీరు ఇటువైపు రాకుండా సహజమైన రక్షణ కవచంలా ఇక్కడ తిన్నెలు రక్షిస్తున్నాయని..వాటిని తవ్వేస్తే భవిష్యత్తులో ముద్దాడపేట, బింగిపేట సమీప గ్రామాల్లో 1,500 ఎకరాల వ్యవసాయ భూములకు గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని డీఎల్‌ఎస్‌ఏ సమావేశాల్లో ప్రస్తావించినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.

బింగుపేట-ముద్దాడపేట రెవెన్యూ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు గతేడాది అక్టోబరు 30న కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే స్పందన కార్యక్రమంలో, మండలంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోవడంతో పాటు, అడుగంటిపోతున్నాయని తెలియజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతకాలానికి స్థానికంగా ఎలాంటి ఇసుక తవ్వకాలు జరగట్లేదని భూగర్భ గనులశాఖ అధికారులు ‘స్పందన’లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉండటంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

8,700 క్యూబిక్‌ మీటర్లకే అనుమతి..

ముద్దాడపేట వద్ద నాగావళి నదిలో ఇసుక నిల్వలు ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రదేశం నది సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో అక్కడ తవ్వకాల అనుమతులకు భూగర్భ గనులశాఖ నిరాకరించింది. తవ్వకాలు చేపడితే భూగర్భ జలాలు ఉప్పగా మారతాయని హెచ్చరించింది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులోనే ఆ రేవు డీఎల్‌ఎస్‌లో అనుమతి పొందలేకపోయింది. జిల్లా కలెక్టర్‌గా మన్‌జీర్‌ జిలానీ సామూన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల మరోసారి డీఎల్‌ఎస్‌ సమావేశం జరిగింది. అందులోనూ ముద్దాడపేటలో ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో భూగర్భ గనులశాఖ అధికారులు ఉన్నతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక కేవలం 0.87 హెక్టార్లలో 8,700 క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వుకునేందుకు అవకాశం ఉందని పేర్కొంటూ రేవుకు ప్రతిపాదించారు. నేటికీ పర్యావరణ అనుమతులు రాలేదు.

నదిలో తవ్వకాల కారణంగా చెరువులను తలపించేలా ఏర్పడిన గోతులు

పరిమితి మించి తోడేస్తున్నారు..

అనుమతులు రాకముందే అధికార పార్టీకి చెందిన మండల ప్రజాప్రతినిధి, ఇతర నాయకుల కనుసన్నల్లో ఇసుక తోడేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దించి అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు జేపీ, నేడు ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల ఆధ్వర్యంలో ముద్దాడపేట పరిధిలో నాగావళి నదిలో పదుల హెక్టార్ల పరిధిలో నాలుగైదు పొక్లెయిన్లతో లక్షల క్యూబిక్‌ మీటర్లు వరకు తవ్వకాలు జరిపినట్లు వాపోతున్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని