logo

ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..

వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు.

Published : 29 Apr 2024 05:52 IST

ఆఫ్‌షోర్‌, వంశధార ప్రాజెక్టులను పట్టించుకోలేదు
న్యాయయాత్ర సభలో వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణిని  పరిచయం చేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే టెక్కలి: వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. ‘దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు సంబంధించి 50 శాతం పనులు పూర్తి చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టి తీశారా? వంశధార శివారు ఆయకట్టుకు నీరిస్తామన్నారు. వచ్చిందా?  వంశధార కాలువల ఆధునికీకరణ చేస్తామని ప్రకటించి నిధులు ఇవ్వకుండా ఊరుకున్నారు. ప్రత్యేక హోదా వస్తే బిడ్డలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయి. పరిశ్రమలు ఏర్పాటవుతాయి. అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణి, సీపీఎం నేత డి.గోవిందరావు, టంకాల గుప్తా, పొట్నూరు ఆనందరావు, కిల్లి రామ్మోహనరావు, విక్రాంత్‌, నంబూరు షణ్ముఖరావు, కొల్లి ఎల్లయ్య, ఈశ్వరరావు పాల్గొన్నారు.

 వైకాపాలో అవమానించారు..

కాంగ్రెస్‌ పార్టీలో శ్రేణుల్ని కాపాడుకోవడానికి..టెక్కలి ప్రాంత అభివృద్ధికి వైకాపాలో చేరితే అడుగడుగునా అవమానించారని.. అగౌరవపరిచారని కిల్లి కృపారాణి భావోద్వేగంతో చెప్పారు. టెక్కలిలో రహదారులు, ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ ఆలోచనతోనే జిల్లాకు విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, వంశధార రెండో దశ పనులు జరిగాయని తెలిపారు. నిశ్శబ్ద విప్లవంలా తమ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పరమేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా సమస్యలకు నిలయంగా మారిందని, పాలకులు జీడి రైతుల సమస్యలు, ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకోలేదని విమర్శించారు. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే అభివృధ్ధి చేశారని, ఇప్పుడు ఏం జరగలేదని ఎద్దేవా చేశారు.

పలాస సభ రద్దు: టెక్కలిలో బహిరంగ సభ అనంతరం పలాస బయలుదేరిన వైఎస్‌ షర్మిల కాశీబుగ్గకు అనుకున్న సమయానికి కంటే రెండు గంటల ముందుగానే చేరుకున్నారు. సభా వేదిక వద్ద జనం అనుకున్న మేరకు రాలేదు. ముఖ్యమైన పని ఉందని ఆమె పలాస బహిరంగ సభను రద్దు చేసుకుని విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటికే వేచి చూస్తున్న జనం నిరాశతో వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు