logo

సంక్షేమం, అభివృద్ధితో కూటమి పాలన

‘వైకాపా అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రతిఒక్కరిపై పన్నుల భారం పడింది.

Published : 04 May 2024 05:44 IST

ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.మూడు వేలు
పెద్దఎత్తున  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం

న్యూస్‌టుడే’ తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

‘వైకాపా అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రతిఒక్కరిపై పన్నుల భారం పడింది. మేము అధికారంలోకి రాగానే వలసల నివారణకు ప్రత్యేకంగా ప్రణాళిక అమలు చేస్తాం. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ముందుకెళ్తాం’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలను ‘న్యూస్‌టుడే’కు ఆయన ఇచ్చిన ముఖాముఖిలో ముఖ్యాంశాలు..

న్యూస్‌టుడే, టెక్కలి 

పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు

సామాజిక భద్రత పింఛను నెలకు రూ.4 వేలకు పెంచుతాం. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఏకంగా రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వమే పెంచుతోంది. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతాం. పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్న వారికి ఆ పింఛను మొత్తం రూ.15 వేలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ10 వేల పింఛను అందిస్తాం. పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం. ఇప్పటి వరకు పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం తరఫున ఇళ్లు నిర్మించి ఇస్తాం.

స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం

మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా నైపుణ్యం కలిగిన స్వయం ఉపాధి పొందేలా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా 19 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరికీ నెలకు రూ.1,500 ఇస్తాం. ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణం రూ.10 లక్షల వరకు పెంచుతాం. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్యాట్యూటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేస్తాం. విద్యార్థినుల చదువుకు అవసరమైన రుణాలు ఇప్పిస్తాం. ఇందుకు ‘కలలకు రెక్కలు’ అనే పథకం అమలు చేస్తాం.

రైతు కూలీలకు కార్పొరేషన్‌

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తారు. రైతులకు రాయితీపై సోలార్‌ పంపుసెట్‌ అందించి మిగులు విద్యుత్తును వారి నుంచి కొనుగోలు చేయిస్తాం. తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తాం. రాయితీపై వ్యవసాయ పరికరాలు అందిస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. పంటల బీమా వర్తింపజేస్తాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో వెయ్యి ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేపట్టి వారికి ఆర్థిక, సాగు మార్కెటింగ్‌ అంశాల్లో తోడ్పాటు ఇస్తాం. ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగుల యూనిట్ల ఆధునికీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పాడి పశువుల సంరక్షణకు గోకులాలను ఏర్పాటు చేస్తాం. మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు తీసుకుంటాం.  ఆక్వాలో అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్తు యూనిట్‌ రూ.1.50కే సరఫరా చేస్తాం. ఐదు వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులు నిర్మిస్తాం.

సూపర్‌- పథకాలతో ఆర్థికాభివృద్ధి

కూటమి అధికారంలో రాగానే నిత్యావసర సరకుల ధరలు తగ్గిస్తాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌర ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి పథకాన్ని అనుసంధానం చేసి ఛార్జీల భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. సూపర్‌-6 పథకాలు ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేయడంతో పెట్టుబడి భారం తగ్గుతుంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు నియంత్రిస్తాం. ఉచితంగా ఇసుక ఇస్తాం. ఇంటి నిర్మాణ భారం తగ్గుతుంది.

వంశధార ప్రధాన కాలువకు సిమెంట్‌ లైనింగ్‌

వైకాపా పాలనలో టెక్కలి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదు. అచ్చెన్న వస్తే మళ్లీ అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది. సాగు, తాగునీటికి ప్రథమ ప్రాధాన్యమిస్తా. వంశధార ప్రధాన కాలువకు సిమెంటు లైనింగ్‌ పనులు చేయిస్తాం. శివారు ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. ఎత్తిపోతల పథకాలు నిర్మించి వంశధార నీరు చేరని ప్రాంతాలకు నీరందిస్తాం. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.

మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు రాయితీ ఇస్తాం. ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ ఏర్పాటు చేస్తాం. అత్యధికంగా ఉద్యోగాలకు అవకాశం ఇచ్చే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి ప్రోత్సాహం కల్పించనున్నాం. పరిశ్రమ అవసరాలకు తగినట్టు నైపుణ్య శిక్షణ అందిస్తాం.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమవడం కోసం డిజిటల్‌ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తాం.

మిషనరీల ఆస్తుల అభివృద్ధికి బోర్డు ఏర్పాటు

మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తాం. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు, ఖబరస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. ఇమామ్‌లకు ప్రతి నెల రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తాం. అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తాం. మసీదు నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేలు, హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం చేస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తాం. శ్మశాన వాటికలకు స్థలం కేటాయించడంతో పాటు జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తాం.

ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు

ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లిస్తాం.  పూర్తి అనుకూల వాతావరణంలో పని చేసేలా చూస్తాం. మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. అలవెన్స్‌, పేమెంట్లపై పునః పరిశీలన చేస్తాం. సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం.  పొందే పొరుగు సేవలు, ఒప్పంద, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు చొప్పున ఇస్తాం.

ప్రైవేటు ఆలయాల్లో పని చేసే అర్చకులకు కనీస వేతనం

కాపుల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలిస్తాం.  ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తాం.  వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంచుతాం. వార్షికాదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం.

రూ.ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల  పింఛను ఇస్తాం. ఉప ప్రణాళిక అమలు చేస్తాం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. స్థానిక సంస్థలు, నియమిత పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. రూ.ఐదు వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం.  దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం కేటాయిస్తాం. మత్స్యకారులకు సముద్ర వేట విరామ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకానికి జీవో 3 పునరుద్ధరిస్తాం.

వైద్య కళాశాల, సాగర నడవా ఏర్పాటు

జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తాం. వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం. పారిశ్రామికంగా ఊతమిచ్చేందుకు, పర్యాటకాభివృద్ధికి భావనపాడు నుంచి విశాఖ వరకు సాగర నడవా నిర్మిస్తాం. తద్వారా జిల్లాలో జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరుగుతాయి.

యువతకు ఉపాధి.. పారిశ్రామిక అభివృద్ధి

నియోజకవర్గంలో వలసల నివారణకు ప్రాధాన్యమిస్తాం. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచుతాం. మండలానికి ఒక పారిశ్రామిక వాడ ఏర్పాటుచేస్తాం. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. సమగ్రాభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యం. స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని