logo

ఎత్తిపోతలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం..!

కాలువల సదుపాయం లేని వ్యవసాయ భూములకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీనిని గుర్తించిన తెదేపా ప్రభుత్వ వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిధుల మంజూరుతో పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీరాయి.

Updated : 05 May 2024 05:24 IST

కొత్తవి పూర్తికావు.. ఉన్నవి నీరివ్వవు  
నిర్వహణకు అన్నదాతల ఆపసోపాలు

కాలువల సదుపాయం లేని వ్యవసాయ భూములకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. దీనిని గుర్తించిన తెదేపా ప్రభుత్వ వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. నిధుల మంజూరుతో పాటు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీరాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. నాటి పాలకులకు మంచిపేరు వస్తుందని ఎత్తిపోతల పథకాలను మరుగున పడేశారు. ఒక దశలో వాటికి వంశధార నీటిని నిలిపివేయాలని ఆ శాఖ ఎస్‌ఈ ఏకంగా ఉత్తర్వులు జారీచేయడం పాలకుల దాష్టీకానికి అద్దం పడుతోంది.


నాటికి.. నేటికి ఎంతో తేడా..!

జిల్లాలో 47 ఎత్తిపోతల పథకాలు ఉండగా, వాటి ద్వారా 31,535 ఎకరాలు సాగు అవుతోందని ప్రభుత్వం చెబుతున్నా. ఏ పథకం సమగ్రంగా పనిచేసిన దాఖలాలు లేవు. ఇవి కాకుండా జిల్లాలో మరో 8 ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఐదేళ్లుగా వీటి పనుల్లో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన చిన్నసాన, మదనగోపాలసాగరం, బొంతు ఎత్తిపోతల పథకాలు ఆయకట్టు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. ఆ ప్రాంతాల్లో వలసల సంఖ్య తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వం వాటి ఉనికినే లేకుండా చేయాలని కుట్రపన్నినట్లు వ్యవహరిస్తోంది. వరుసగా నాలుగేళ్లు శివారు ప్రాంతాలకు సాగునీరివ్వాలన్న సాకుతో ఎత్తిపోతల పథకాలకు నీరివ్వకుండా ఆపేశారు. మరోవైపు విద్యుత్తు సరఫరా నిలిపేశారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పొలాల్లో పంటలు ఎండిపోతున్నా పాలకులు కనికరించలేదు. అక్టోబరు నెలలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు హైడ్రాలిక్‌ అనుమతులు లేవంటూ నీటిసరఫరా నిలిపి వేయాలని వంశధార అధికారులు ఆదేశాలివ్వడం అటు రైతుల్ని, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేసింది.


గడ్డెయ్యపేట పథకం పునరుద్ధరణ ఎప్పుడు..?

వినియోగంలో లేని గడ్డెయ్యపేట ఎత్తిపోతల పథకం

నరసన్నపేట మండలం గడ్డెయ్యపేట ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్సీ రైతులు సాగునీటి సదుపాయం పొందేవారు. రెండేళ్ల క్రితం ఎన్‌హెచ్‌ 326ఏ రహదారి విస్తరణలో ఈ పథకం గొట్టాలు తొలగించాల్సి వచ్చింది. దీని పునరుద్ధరణకు ఎన్‌హెచ్‌ శాఖ కొంత మొత్తంలో నిధులు మంజూరు చేయగా, ఈ పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. పైగా టెక్కలిపాడు పథకానికి అనుసంధానం చేసి చేతులు దులుపుకొన్నారు.


ముఖ్యమంత్రి ప్రకటనల మాటేంటి..

మడపాం వద్ద 2019లో నాటి ఎమ్మెల్యే రమణమూర్తి ఆవిష్కరించిన శిలాఫలకం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో మడపాం ఎత్తిపోతల పథకానికి రూ.15కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తీరా ఇప్పటికీ ఆ నిధులకు సంబంధించి అతీగతీ లేదు. గత ప్రభుత్వ హయంలో 2019 ఫిబ్రవరి 14న రూ.4.5 కోట్లతో మడపాం ఎత్తిపోతల పథకానికి అప్పటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేశారు. వైకాపా అధికారంలోకి రావడంతో ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి మళ్లీ రూ.15 కోట్లతో ప్రతిపాదించారు. ఇలా రద్దులు, ప్రతిపాదనలే తప్ప పనులు జరగలేదు.


నిర్వీర్యంతో నీలినీడలు

మదనగోపాలసాగరం వద్ద కాపర్‌ చోరీకి గురైన నియంత్రికను పరిశీలిస్తున్న అధికారులు

ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా చేసేందుకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని పాలకులు హుకుం జారీచేయడం తెరవెనకే జరిగినా దాని పర్యవసానం శాశ్వత నష్టాన్ని మిగిల్చింది. అదే సమయంలో చిన్నసాన, నారాయణవలస, మదనగోపాలసాగరం, సుభద్రాపురం ఎత్తిపోతల పథకాల వద్ద విద్యుత్తు నియంత్రికల నుంచి లక్షల విలువైన కాపర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉపకరణాలు పునరుద్ధరిస్తే తప్ప పథకాలు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు. పక్షపాత ధోరణితో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైకాపా పాలకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారని పలువురు పెదవి విరుస్తున్నారు.

నిరుపయోగంగా చిన్నసాన ఎత్తిపోతల పథకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని