logo

మీరైతే.. ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా జగన్‌..?

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో వైకాపా ప్రభుత్వం చాలావరకు ఊరికి దూరంగా స్థలాలు కేటాయించింది. కొండలు, శ్మశానాల దగ్గర కాలనీలను గుర్తించారు. లేఅవుట్ల దగ్గరకు వెళ్లడానికి సరైన మార్గం లేదు.

Published : 06 May 2024 02:58 IST

నివాసయోగ్యంగా లేని ప్రాంతాల్లో  పేదలకు స్థలాల కేటాయింపు
ఆశలు కల్పించి నిలువునా మోసం

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో వైకాపా ప్రభుత్వం చాలావరకు ఊరికి దూరంగా స్థలాలు కేటాయించింది. కొండలు, శ్మశానాల దగ్గర కాలనీలను గుర్తించారు. లేఅవుట్ల దగ్గరకు వెళ్లడానికి సరైన మార్గం లేదు. ఇళ్ల నిర్మాణాలకు భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండటంతో లబ్ధిదారులు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ‘తాడేపల్లి కోటలో ఉండే జగన్‌ రాళ్ల గుట్టల వద్ద ఇల్లు కట్టుకుంటారా’? అని పలువురు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.

న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం, ఆమదాలవలస గ్రామీణం, లావేరు, పోలాకి, నందిగాం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, సోంపేట


కొండపై కాలనీ..

ఆమదాలవలస మండలం కనుగులవలస పంచాయతీ పరిధి కంచరాపువానిపేట వద్ద జగనన్న కాలనీ పేరిట 58 మందికి పట్టాలు ఇచ్చారు. అక్కడికి వెళ్లడానికి దారి లేకపోవడం.. అది కొండ ప్రాంతం కావడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు.


హద్దు రాళ్లు పాతి వదిలేశారు

ఆమదాలవలస పురపాలక సంఘ పరిధి ఏడో వార్డు చింతాడ, సప్తపురాలుకు చెందిన 246 మందికి చింతాడ కొండ వద్ద వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ పేరిట పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలకు 2021లో సభాపతి తమ్మినేని సీతారాం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. అప్పుడే కొందరు లబ్ధిదారులు ‘కొండపై ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలి? ఇక్కడ కాలనీ వద్దు’ అని సభాస్థలి వద్ద బహిరంగంగానే అడిగారు. వారు స్పందిస్తూ అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని.. ఈ ప్రాంతం పట్టణంగా అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు. కొండపై రాళ్లు తొలగించి చదును చేసి హద్దు రాళ్లు పాతారు. అక్కడక్కడ నీటి కుంటలు ఏర్పాటు చేసి ఊరుకున్నారు.


ఒక్కరూ ముందుకు రాలేదు..

పోలాకి మండలం తోటాడ, కోడూరు, డీఎల్‌పురంలో లేఅవుట్లు కొండల మధ్య, జీడి తోటల్లో ఉన్నాయి. డీఎల్‌పురం పంచాయతీ సత్రవుపేటలో శ్మశానం వద్ద స్థలాలు చూపడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. గొల్లలవలస, ఎస్‌ఎల్‌పురం లబ్ధిదారులకు 2 కి.మీ. దూరంలో కేటాయించడంతో ఆసక్తి చూపలేదు. మబుగాంలో గెడ్డ పక్కన స్థలం చూపడంతో ఇళ్లు నిర్మించుకోలేమని చేతులెత్తేశారు.


1,100 ఇళ్లకు ఒక్కటీ పూర్తి చేయలేదు..

నందిగాం మండలం పెద్దతామరాపల్లి నర్సిపురం, దిమ్మిడిజోల, దేవుపురం, నందిగాం పంచాయతీల పరిధిలో కేటాయించిన స్థలాల్లో ఇప్పటివరకు ఒక్క పునాది వేయలేదు. 32 పంచాయతీల్లో 1,100 ఇళ్లు మంజూరు చేయగా ఒక్క ఇల్లూ పూర్తి చేయలేదు. నీరు అందుబాటులో లేకపోవడం, నిర్మాణ సామగ్రి తరలించడానికి రోడ్డు తదితర సమస్యలు ఉండటంతో పూర్తి కాలేదు.


నీరే లేదు..నిర్మాణాలెలా?

కొత్తూరు మండలం బలద పంచాయతీకి చెందిన 36 మందికి జగనన్న కాలనీలో స్థలాలు కేటాయించారు. రెండేళ్లు దాటినా ఒక్కరూ ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. నీరు, రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ముందుకు రాలేదు.


ఒక్క పునాదీ తీయలేదు..

లావేరు మండలం తామాడ పంచాయతీ పరిధి తామాడ, కొత్త, పాతరౌతుపేట, రాయింలింగారిపేట, నడుపూరిపేట, సూర్యనారాయణపురం గ్రామాలకు చెందిన 42 మందికి నడుపూరిపేట వద్ద కొండ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఇప్పటివరకు ఒక్క పునాదీ తీయలేదు. ఇక్కడి లేఅవుట్‌లో విద్యుత్తు, తాగునీరు, రహదారులు ఏర్పాటు చేయలేదు. పాతరౌతుపేట, రాయింలింగారిపేట, తామాడ గ్రామాలకు సంబంధించిన లేఅవుట్‌ సుమారు 4 కి.మీ. దూరంలో ఉండటం, ఆ ప్రాంతం అడవిని తలపిస్తుండటంతో లబ్ధిదారులు తిరస్కరించారు.  

శ్మశానానికి సమీపంలో..

ఎల్‌ఎన్‌పేట మండలం ఎంబరాం గ్రామానికి దూరంగా శ్మశానానికి సమీపంలో ప్రభుత్వం 36 సెంట్లు కొనుగోలు చేసింది. ఇక్కడి జగనన్న కాలనీలో 13 మందికి పట్టాలు ఇచ్చారు. విద్యుత్తు, తాగునీరు, రహదారి సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు.


తుపాను ప్రభావిత ప్రాంతంలో..

సోంపేట మండలం బారువ సముద్ర తీరం వద్ద నివాసయోగ్యం కాని ప్రాంతంలో 190 మంది లబ్ధిదారుల కోసం జగనన్న కాలనీ-2 ఏర్పాటు చేశారు. రహదారి నిర్మాణానికి వ్యయం చేసిన రూ.10 లక్షలు వృథా అయ్యాయి. ఇక్కడ ఇళ్లు నిర్మించుకోలేమని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు.


అక్కడ ఇల్లు ఎలా నిర్మించుకుంటాం..?: మా గ్రామానికి రెండు కి.మీ. దూరంలో కొండల మధ్య ఇంటి స్థలం కేటాయించారు. అక్కడికి వెళ్లాలంటే వంశధార ప్రధాన ఎడమ కాలువ దాటాలి. వర్షం పడితే వరద నీరు పోటెత్తుతోంది. పిల్లలు బడికి ఎలా వెళ్తారు? అక్కడ ఇల్లు కట్టుకుని ఎలా ఉండగలం?  

కోనారి హైమావతి, పెద్దతామరాపల్లి


చిన్న గాలి వీచినా ఇళ్లలోకి ఇసుక:  సముద్రపు ఇసుక దిబ్బల పరిధిలో స్థలం కేటాయించారు. చిన్నపాటి గాలి వీచినా ఇసుక ఇళ్లలోకి చేరుతుంది. శ్మశానం పక్కన తీరానికి దగ్గరలో లేఅవుట్‌ ఉండటంతో తుపానుల సమయాల్లో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. నివాసానికి అనువుగా లేకపోవడంతో ఇల్లు నిర్మించలేదు.

మహాలక్ష్మిదాసు, లబ్ధిదారు, బారువ


రెండు కిలోమీటర్లు వెళ్లాలంటే ఎలా? మేం ప్రస్తుతం ఉంటున్న ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో స్థలం చూపారు. శ్మశానం పక్కన ఇల్లు కట్టువాలంటే ఎలా? వేరే చోట కేటాయించాలని కోరినా పట్టించుకోలేదు. 

ప్రియా సుజాత, డీఎల్‌పురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని