logo

వివాహిత ఆత్మహత్య

ఇచ్ఛాపురం పట్టణం పెద్దాకులవీధిలో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్న శ్రీదేవి సుష్మల్‌ (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 06 May 2024 05:48 IST

శ్రీదేవి సుష్మల్‌

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పట్టణం పెద్దాకులవీధిలో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తున్న శ్రీదేవి సుష్మల్‌ (43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై వి.సత్యనారాయణ, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దాకుల వీధిలో ఉంటున్న రఘునాథ్‌, మాలతిల పెద్దకోడలు శ్రీదేవి. మేడ పైభాగాన ఆమె భర్త, ఇద్దరు కుమారులతో కలసి ఉంటోంది. తరచూ నీళ్లకోసం అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ జరిగేది. ఆదివారం కూడా వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో తన గదికి వెళ్లిన శ్రీదేవి క్షణికావేశంలో పంకాకు ఉరేసుకుని మృతిచెందింది. కొంత సమయం తరువాత కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూడగా, పంకాకు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.


యువకుడి బలవన్మరణం

సంతోష్‌కుమార్‌

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన టేకి సంతోష్‌కుమార్‌ (28) అనారోగ్యంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్లుగా నరాల బలహీనతతో మానసికంగా బాధపడుతున్న యువకుడు 2021 నుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లితో పాటు ఉంటున్న సంతోష్‌కుమార్‌ ఇంట్లో ఆమె బాత్‌రూంకు వెళ్లిన సమయంలో బెడ్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి కుమారి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో సుమారు 65 ఏళ్ల వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. ఇచ్ఛాపురం రైలునిలయం దిగువమార్గంలో ఈ మృతదేహాన్ని ఆదివారం పలాస జీఆర్పీ పోలీసులు గుర్తించారు. 5.3 అడుగుల ఎత్తు, నీలం పొడుగుచేతుల చొక్కా, నీలం, నలుపు రంగుల లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ అధికారి షేక్‌ షరీఫ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని